జన్వాడ ఫాం హౌజ్ పార్టీపై తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. సెక్రటేరియట్ లో మంగళవారం సీఎం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బామ్మర్ది రాజ్ పాకల ఫాం హౌజ్ పార్టీ అంశంపై హాట్ కామెంట్స్ చేశారు.
దీపావళి పండుగ అంటే తమకు చిచ్చు బుడ్లని, వాళ్లకు మాత్రం సారా బుడ్లని వ్యాఖ్యానించారు. దీపావళి దావత్ అలా చేస్తారని తమకు తెలియదన్నారు. రాజ్ పాకాల ఏమీ చేయకపోతే ఎందుకు పారిపోయారు? ముందస్తు బెయిల్ ఎందుకు అడిగారు.? ఇంటి దావత్ చేస్తే క్యాసినో కాయిన్స్, విదేశీ మద్యం ఎందుకు దొరికాయి? అని సీఎం రేవంత్ సూటిగా ప్రశ్నించారు.
అదేవిధంగా మూసీ పునరుజ్జీవనంపై మాట్లాడుతూ, ఎవ్వరు ఎంతగా అడ్డుకున్నా మూసీ పునరుజ్జీవం చేసి తీరుతామన్నారు. మరో మూడు రోజులో.. అంటే నవంబర్ 1వ తేదీన మూసీ పునరుజ్జీవ పనులకు శంకుస్థాపన కూడా చేస్తామన్నారు. మొదటి ఫేస్ 21 కిలో మీటర్ల వరకు అభివృద్ధి చేస్తామన్నారు. గండిపేట, హిమాయత్ సాగర్ ల నుండి బాపుఘాట్ వరకు మొదటి ఫేస్ పనులు చేపడతామన్నారు. నెల రోజుల్లో డిజైన్లు పూర్తవుతాయని సీఎం చెప్పారు.
మల్లన్న సాగర్ నుండి గోదావరి జలాలను తెచ్చి గండిపేటలో పోస్తామని, దీనికి సంబంధించి ట్రంక్ లైన్ కోసం నవంబర్ మొదటి వారంలో టెండర్లు పిలుస్తామన్నారు. బాపుఘాట్ వద్ద ప్రపంచంలోనే ఎతైన గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. బాపుఘాట్ వద్ద బ్రిడ్జి కం బ్యారేజి నిర్మాణం చేపడతామని, అక్కడ అభివృద్ధి కోసం ఆర్మీకి చెందిన భూమిని కూడా అడిగామన్నారు.
రాబోయే 15 రోజుల్లో ఎస్టీపీలకు టెండర్లు పిలుస్తామని, మూసీని ఎకో ఫ్రెండ్లీ అండ్ వెజిటేరియన్ కాన్సెప్ట్ తో అభివృద్ధి చేస్తామని, మూసీ వెంట అంతర్జాతీయ యూనివర్సిటీ, గాంధీ ఐడియాలజీ సెంటర్, రిక్రియేషన్, నేచర్ క్యూర్ సెంటర్లను ఏర్పాటు చేస్తామన్నారు. తాను ఫుట్ బాల్ ప్లేయర్ నని, గేమ్ ప్లాన్ పై తనకు క్లారిటీ ఉందన్నారు. రాజకీయంగా నష్టం జరుగుతుందని తెలిసినా, భవిష్యత్ నగరం కోసం మూసీ పునరుజ్జీవనంపై ముందుకే వెడతామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.