రాష్ట్రం నుంచి ఖాళీ అవుతున్న రాజ్యసభ సీట్ల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రివర్స్ స్కెచ్ వేస్తున్నట్లు సమాచారం. బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ కు భారీ షాక్ ఇచ్చే ప్రక్రియలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి పకడ్బందీ వ్యూహం పన్నినట్లు విశ్వసనీయ సమాచారం. బీఆర్ఎస్ కు చెందిన రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, జోగినపల్లి సంతోష్ కుమార్, బడుగుల లింగయ్య యాదవ్ లు వచ్చే ఏప్రిల్ 2న రిటైరవుతున్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలో అధికారం చేయి మారిన పరిస్థితుల్లో ఖాళీ అవుతున్న ఈ మూడు సీట్లలో బీఆర్ఎస్ తిరిగి ఒక్క సీటును మాత్రమే దక్కించుకునే అవకాశం ఉంది. మిగతా రెండు స్థానాలను కాంగ్రెస్ సునాయసంగా గెల్చుకునే ఎమ్మెల్యేల సంఖ్యా బలం ఉంది.

రాజ్యసభ ఎన్నికల నామినేషన్ల దాఖలుకు ఈనెల 15వ తేదీ చివరి గడువు కావడం గమనార్హం. కానీ ఇప్పటి వరకు అటు అధికార కాంగ్రెస్ పార్టీగాని, ఇటు బీఆర్ఎస్ గాని తమ తమ అభ్యర్థులను ఖరారు చేయలేదు. ఇరు పార్టీలు కూడా ప్రత్యర్థి అభ్యర్థులెవరనే అంశంపైనే ప్రధాన దృష్టి కేంద్రీకరించినట్లు తెలుస్తోంది. ఈ విషయంలో బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ తీసుకునే నిర్ణయాన్ని బట్టి కాంగ్రెస్ పార్టీ తన వ్యూహాన్ని అమలు చేసే అవకాశమున్నట్లు తెలిసింది. బీఆర్ఎస్ అభ్యర్థిత్వాన్ని వద్దిరాజు రవిచంద్ర, జోగినపల్లి సంతోష్ కుమార్, రావుల చంద్రశేఖర్ రెడ్డిలు ఆశిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే అభ్యర్థి ఎంపిక విషయంలో సామాజిక న్యాయాన్ని పాటిస్తూ కేసీఆర్ వద్దిరాజు రవిచంద్రకు అవకాశం ఇస్తారా? లేక ఎన్నికలకు ముందు గట్టి హామీతో పార్టీలో చేరినట్లు పేర్కొంటున్న రావుల చంద్రశేఖర్ రెడ్డికి ఇస్తారా? లేక కుటుంబానికే ప్రాధాన్యతనిస్తూ జోగినపల్లి సంతోష్ కుమార్ కే తిరిగి సీటు కేటాయిస్తారా? అనే అంశంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

జోగినపల్లి సంతోష్ కుమార్ (ఫైల్ ఫొటో)

ఒకవేళ కేసీఆర్ చివరికి తన కుటుంబ సభ్యునికే ప్రాధాన్యతనిస్తూ సంతోష్ కుమార్ కు రాజ్యసభ సీటు కేటాయిస్తే సీఎం రేవంత్ రెడ్డి వేగంగా రాజకీయ పావులు కదిపే అవకాశం ఉందంటున్నారు. ఇందులో భాగంగానే సంతోష్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసిందే తడవుగా కాంగ్రెస్ పార్టీ రంగంలోకి మూడో అభ్యర్థిని దించే అవకాశం లేకపోలేదంటున్నారు. కుటుంబ ప్రయోజనం మినహా మరే ప్రయోజనం కేసీఆర్ కు లేదని, అందుకే సంతోష్ ను మళ్లీ ఎంపిక చేశారనే ప్రచారాన్ని తెరపైకి తీసుకువచ్చి కాంగ్రెస్ తరపున మూడో అభ్యర్థిని పోటీకి దింపే అవకాశాలు గణనీయంగా ఉన్నట్లు సమాచారం. మూడో అభ్యర్థి గెలుపునకు అవసరమైన ఎమ్మెల్యే సంఖ్యాబలం లేకపోయినా, కేసీఆర్ ఎంపిక చేసే అభ్యర్థిత్వంపై క్రాస్ ఓటింగ్ ఆధారపడి ఉంటుందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. రాజ్యసభ ఎన్నికల్లో కేసీఆర్ కు భారీ షాక్ ఇచ్చేందుకు సీఎం రేవంత్ పకడ్బందీగా పొలిటికల్ స్కెచ్ వేసినట్లు అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. కాగా ఈ వార్త రాస్తున్న సమయానికి ఇంకా ఏ పార్టీ నుంచి కూడా రాజ్యసభ అభ్యర్థులు ఖరారు కాకపోవడం గమనార్హం.

Comments are closed.

Exit mobile version