నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్భన్ రెడ్డి ఉన్నఫళంగా హైదరాబాద్ కు వెళ్లారు. ఓ ఎమ్మెల్యే స్థాయి నాయకుడు హైదరాబాద్ కు వెళ్లడం పెద్ద విశేషం కాకపోవచ్చు.., కానీ సాక్షాత్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వరంగల్ మహానగరంలో పర్యటిస్తున్న సమయంలో చోటు చేసుకున్న పరిణామాల్లోనే పెద్ది సుదర్శన్ రెడ్డి అర్జంటుగా హైదరాబాద్ కు వెళ్లడం ఆస్తికర పరిణామంగా రాజకీయ పరిశీలకులు అభివర్ణిస్తున్నారు. గడచిన కొద్ది గంటలుగా సీఎం కేసీఆర్ వరంగల్ మహానగరంలో పర్యటిస్తూ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తున్న సమయంలోనే, పెద్ది సుదర్శన్ రెడ్డి రాజధానికి పయనమై వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. సీఎం కేసీఆర్ వరంగల్ నగర పర్యటన సందర్భంగా ఆయన రాకకు ముందు జరిగినట్లు పేర్కొంటున్న పరిణామాలను ఓసారి పరిశీలిస్తే…
సీఎం కేసీఆర్ రాక సందర్భంగా ఆయనను కలిసేందుకు నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి వరంగల్ వెళ్లారు. అయితే హన్మకొండలో ఎమ్మెల్యే పెద్ది వాహనాన్ని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో మనస్తాపానికి గురైన సుదర్శన్ రెడ్డి తన కారు దిగి… పోలీస్ హెడ్ క్వార్టర్స్ నుంచి ఆర్ అండ్ బీ గెస్ట్ హౌజ్ వరకు పాదయాత్ర చేశారు. అంతేకాదు ఏకశిలా పార్కు వద్ద కూడా ఎమ్మెల్యే పెద్దికి చేదు అనుభవం ఎదురైంది. అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకోవడంతో పెద్ది సుదర్శన్ రెడ్డి చేసేదేమీలేక వెనుదిరిగారు. ఈ ఘటనలు జరిగిన తర్వాత సీఎం కేసీఆర్ వరంగల్ నగరంలో పర్యటించి నిర్వహించిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పెద్ది సుదర్శన్ రెడ్డి ఎక్కడా కనిపించకపోవడం విశేషం. అయితే సీఎం అర్బన్ జిల్లా కార్యక్రమాల్లో పాల్గొంటున్నందున రూరల్ జిల్లా ఎమ్మెల్యేలకు, నాయకులకు అనుమతి లేదని పోలీసులు ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. వర్ధన్నపేట, పరకాల నియోజకవర్గాల పరిధి కొంతవరకు అర్బన్ జిల్లాలో ఉండడంతో ఆయా కేంద్రాల ఎమ్మెల్యేలను సీఎం కార్యక్రమాల్లో అనుమతించినట్లు చెబుతున్నారు.
ఇదే దశలో మానుకోట జిల్లాలోని మహబూబాబాద్, డోర్నకల్ ఎమ్మెల్యేలు శంకర్ నాయక్, రెడ్యా నాయక్ లు సీఎం కేసీఆర్ పాల్గొన్న కార్యక్రమాల్లో కనిపించడం గమనార్హం. కేవలం నర్సంపేట ఎమ్మెల్యేను మాత్రమే ‘రూరల్’ పరిధి పేరుతో అడ్డుకున్నారనే వాదన వినిపిస్తోంది. ఆయా పరిణామాల అనంతరం ఎమ్మెల్యే సుదర్భన్ రెడ్డి అకస్మాత్తుగా హైదరాబాద్ కు వెళ్లడం చర్చకు దారి తీసింది. గత కొంత కాలంగా మంత్రి ఎర్రబెల్లి దయాక్ రావు, ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిల మధ్య పలు అంశాల్లో ‘పంచాయతీ’ జరుగుతున్నట్లు గులాబీ పార్టీ శ్రేణులు చర్చించుకుంటున్నాయి. అనేక కారణాలవల్ల ఈ ఇద్దరి మధ్య రాజకీయ విభేదాలు ఏర్పడినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ పరిస్థితుల్లోనే తమ నాయకుడికి సోమవారం నాటి సీఎం కేసీఆర్ వరంగల్ పర్యటన సందర్భంగా చేదు అనుభవాలు, అవమానాలు ఎదురయ్యాయా? అని ఎమ్మెల్యే పెద్ది అనుచరగణం సందేహిస్తోంది. అయితే తనకు ఎటువంటి అవమానం జరగలేదని, మరే ఇబ్బంది ఏర్పడలేదని, సీఎం కేసీఆర్ రాక సందర్భంగా పోలీసులకు, ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా తాను నడిచివెళ్లినట్లు ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఓ ప్రకటన జారీ చేయడం మొత్తం ఎపిసోడ్ లో కొసమెరుపు.