తెలంగాణా ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న ‘దళిత బంధు’ పథకం అమలు, బడ్జెట్ పై సీఎం కేసీఆర్ సంచలన ప్రకటన చేశారు. ఈ పథకం కింద రూ. 80 వేల నుంచి లక్ష కోట్ల వరకు ఖర్చు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. ఎస్సీ కార్పొరేషన్ ఛైర్మన్‌గా బండా శ్రీనివాస్‌ను నియమించిన సందర్భంగా హుజూరాబాద్ నియోజకవర్గానికి చెందిన దళిత సంఘాల నేతలు, ప్రజాప్రతినిధులు, మేధావులు, కార్యకర్తలు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా ప్రగతి భవన్ కు వచ్చిన ఆయా నేతలను ఉద్దేశించి సీఎం మాట్లాడుతూ, కాళ్లు, చేతులు మాత్రమే ఆస్తులుగా బతుకుతున్న దళిత కుటుంబాలే మొదటి ప్రాధాన్యతగా ఈ పథకం రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తామని చెప్పారు. హుజూరాబాద్‌లో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభమయ్యే దళితబంధు పథకం కేవలం తెలంగాణలోనేగాక యావత్ దేశానికి ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు. ఈ పథకం ఎస్సీలందరినీ ఆర్థిక, సామాజిక వివక్షల నుంచి విముక్తులను చేయబోతోందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.