గాంధీ ఆసుపత్రికి చెందిన జూనియర్ డాక్టర్లను, సిబ్బందిని తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రశంసించారు. కరోనా రోగులకు ఇక్కడి డాక్టర్లు, సిబ్బంది అందిస్తున్న సేవలను సీఎం అభినందించారు. సికింద్రాబాద్ లోని గాంధీ ఆసుపత్రిని సీఎం కేసీఆర్ కొద్దిసేపటి క్రితం సందర్శించారు. గాంధీ ఆస్పత్రిలో అందిస్తున్న కరోనా సేవలను పరిశీలించారు. కరోనా చికిత్సలో కీలకంగా ఉన్న గాంధీ ఆస్పత్రిలో ఏర్పాట్లను, రోగులకు అందుతున్న సౌకర్యాల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రుల్లో ఆక్సిజన్ ప్లాంట్ల ఏర్పాటుపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఆక్సిజన్ వసతి, మందుల సరఫరా తదితర అంశాలపై ఆరా తీశారు. గాంధీలోని కోవిడ్ ఎమర్జెన్సీ వార్డును కూడా సీఎం పరిశీలించారు. చికిత్స పొందుతున్న కరోనా రోగులను పరామర్శించారు. ఐసీయూలోని రోగులను పరామర్శించిన కేసీఆర్ వారికి ధైర్యం చెప్పారు. ఈటెల రాజేందర్ ను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేశాక ఆరోగ్యశాఖను కేసీఆర్ వద్దే ఉంచుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆరోగ్య శాఖ వ్యవహారాలను ఆయన స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. గాంధీ ఆసుపత్రిని సందర్శించిన ముఖ్యమంత్రి వెంట మంత్రి హరీశ్ రావు, సీఎంవో అధికారులు ఉన్నారు.