రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు వరదల నేపథ్యంలో అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఆదేశించారు. ఉమ్మడి వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో అధిక వర్షపాతం నమోదైందని, దాదాపు అన్ని చెరువులు అలుగుపోస్తున్నాయని చెప్పారు. ఆ రెండు జిల్లాల్లో మరింత అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. సీఎం ఆదేశాల మేరకు అధికార యంత్రాంగం రెండు హెలికాఫ్టర్లను సిద్ధంగా ఉంచింది. వరదల వల్ల చిక్కుకున్న ప్రజలను కాపాడేందుకు వాటిని వినియోగిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన హెలికాఫ్టర్ తో పాటు సైనిక హెలికాఫ్టర్ కూడా అందుబాటులోకి వచ్చింది.
రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తుండడం వల్ల అనేక చెరువులు అలుగుపోస్తూ, కాలువలు పొంగి ప్రవహిస్తున్న సంగతి తెలిసిందే. దరిమిలా చాలా చోట్ల రోడ్లపైకి నీరు వచ్చింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ వర్షాలు, వరదల పరిస్థితిపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. ఇందులో భాగంగానే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, మంత్రులతో శనివారం మాట్లాడి ఆయా జిల్లాల పరిస్థితిని సమీక్షించి, తగిన సూచనలు చేశారు. హైదరాబాద్ లో రెండు కంట్రోల్ రూమ్ లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
మంత్రులు తమ జిల్లాల్లోనే ఉండాలని స్థానిక కలెక్టర్, పోలీస్ అధికారులతో కలిసి నిరంతరం పరిస్థితిని పర్యవేక్షించాలని ఆదేశించారు. చాలా చెరువులు పూర్తి స్థాయిలో నిండాయని, ఫలితంగా కొన్ని చోట్ల చెరువులకు గండ్లు పడే అవకాశం ఉందన్నారు. వరదల వల్ల రోడ్లు తెగిపోయే ప్రమాదం ఉందని, లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యే పరిస్థితి ఉత్పన్నం కావచ్చని సీఎం చెప్పారు.