నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో భాగంగా తెలంగాణా సీఎం కేసీఆర్ హాలియా బహిరంగసభలో ప్రసంగించారు. టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నోముల భగత్ విజయాన్ని కాంక్షిస్తూ సీఎం కేసీఆర్ చేసిన ప్రసంగంలోని ముఖ్యాంశాలు ఇవీ:
– ఈ సభ జరగకూడదని, మీరూ, నేనూ కలవకూడదని చేయని ప్రయత్నం లేదు. ఈ కల్చర్ ఎక్కడా లేదు. సభ జరగనీయవద్దని చాలా ప్రయత్నాలు చేశారు.
– నేను చెప్పిందే వేదం కాదు. గ్రామాల్లో చర్చ పెట్టండి. పరిణితితో ఓటు వెయ్యండి. గతంలో చెప్పాను. మళ్లీ అదే మాట చెబుతున్నాను. ఎలక్షన్ రాగానే ఆగమాగం కావద్దు.
– గాడిదలకు గడ్డి వేసి, ఆవులకు పాలు పిండితే రావు. ముండ్ల చెట్లకు పండ్లు రావు. వాస్తవాలు మీ కండ్ల ముందున్నయ్. అన్ని విషయాలు అర్థమైనయ్. ఎవరు గెలిస్తే మంచిదో మీకు ఈపాటికే ఓ అవగాహన వచ్చి ఉంటది.
– నా మిత్రుడు నర్సింహయ్య కొడుకు, విద్యావంతుడు, యువకుడు, మీకు తగు రీతిలో సేవ చేస్తడు. భగత్ కు ఓట్లు దుంకితే నెల్లికల్లు నీళ్లు దుంకుతయి.
– జానారెడ్డి 30 ఏండ్ల చరిత్ర, అంత పొడుగు, ఇంత పొడుగు అంటడు. నందికొండను దాని ఖర్మానికి ఒదిలిపెట్టిండు. నందికొండలో డిగ్రీ కాలేజి మంజూరు చేస్తం.
– పార్టీల చరిత్రను కూడా చూడాలె. సీఎం పదవి జానారెడ్డి భిక్ష అట. ఇది జరిగే పనేనా? తెలంగాణా ప్రజలు కేసీఆర్ కు భిక్ష పెట్టారు. నాకు ఎవడూ భిక్ష పెట్టలేదు.
– కాంగ్రెస్ నాయకులు సక్కగ ఉంటే… ఎందుకు గులాబీ జెండా ఎగరాల్సి వచ్చింది? కాంగ్రెస్ చరిత్ర పదవుల కోసం తెలంగాణాను ఆంధ్రోళ్లకు ఒదిలిపెట్టింది.
– రైతుబంధు వస్తలేదా? రైతు బీమా వస్తలేదా? మిషన్ భగీరథ… కండ్ల ముందు కనిపిస్తలేవా? కాంగ్రెస్ పాలన ఉంటే రైతుబంధు వస్తుండెనా? ధరణి పోర్టల్ మరో చరిత్ర.
– అరవై ఏండ్ల పరిపాలనలో ఆగమాగం జేసిండ్లు తెలంగాణాను. ఒక్కటొక్కటి పరిష్కించుకుంట వస్తున్నం. కరెంటు, మంచినీళ్ల బాధ తీర్చినం. పేదల సంక్షేమం చూస్తున్నం.
– బల్లగుద్ది, రొమ్ము విర్చుకుని, కాలర్ ఎగరేసుకుని చెప్తున్న. ధాన్యం ఉత్పత్తిలో ఇండియాలోనే మొదటి స్థానంలో ఉన్నం. మంచిచేసే వాళ్లను ఆదరిస్తే, గెలిపిస్తే చాలా మంచి జరుగుతది.
– అన్నివర్గాలను కలుపుకుని పోతున్నం. అంగన్ వాడీ వర్కర్ల నుంచి అన్ని రకాల ఉద్యోగులను సమానంగా చూస్తున్నం. అందరి కడుపులు నింపే ప్రయత్నం చేస్తున్నం.
– స్మశానవాటికలు, వైకుంఠధామాలు, పల్లె ప్రకృతి వనాలు నిర్మించాం. తండాల్లో గిరిజనులు వాళ్ల పాలన వాళ్లే చేస్తున్నరు.
– గొర్రెలు మేసిండ్లు తప్ప. యాదవులకు వీళ్లు ఎన్నడన్నా గొర్రెలు ఇచ్చిండ్లా? గొర్రెల యూనిట్ ధర పెంచుతాం.
– భగత్ ను గెలిపిస్తే కోటిరెడ్డికి ఎమ్మెల్సీ చేస్తా. అభివృద్ధి అంటే ఏమిటో 15 రోజుల్లోనే మళ్లీ వచ్చి చూపిస్తా. వంద శాతం అద్భుత అభివృద్ధి చేస్తం. రేషన్ కార్డులు మంజూరు చేస్తం.
– సాగర్ ఆయకట్టుకు గోదావరి నీళ్లు పాలేరు ద్వారా చెరువులు నింపుతం. లిఫ్టులన్నింటినీ పూర్తి చేయకుంటే మళ్లీ ఎన్నికల్లో ఓట్లు అడగం. భగత్ గెలుపు ఖాయమైందని నాకు తెలిసిపోయింది.
– గిరిజనుల పోడు భూముల సమస్యను కూడా ప్రజాదర్బార్ ద్వారా పరిష్కరిస్తాం. అవసరమైతే రెండురోజులు ఇక్కడే ఉంటా. నాగార్జునసాగర్ నుంచే ఈ సమస్య పరిష్కారానికి శ్రీకారం చుడతా.
– గులాబీ జెండా ఎగరేయండి. మీకు అండగా కేసీఆర్ ఉంటడు.