తెలంగాణాలో సీఎం కేసీఆర్ తొలి విగ్రహం ఏర్పాటైంది. జనగామ జిల్లా చిల్పూర్‌ మండల కేంద్రంలో స్థానిక సర్పంచ్ దీన్ని ఏర్పాటు చేశారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని సీఎం కేసీఆర్ తొమ్మిది అడుగుల విగ్రహాన్ని సర్పంచ్ ఉద్దమర్రి రాజ్ కుమార్ ఆవిష్కరించారు. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం తన ప్రాణాలను ఫణంగా పెట్టి కేసీఆర్‌ స్వరాష్ట్ర కలను నిజం చేశారని, ఆయన పోరాట స్ఫూర్తికి గుర్తుగా సీఎం కేసీఆర్‌ విగ్రహాన్ని ఆవిష్కరించినట్లు సర్పంచ్‌ తెలిపారు. సుమారు రూ. 5 లక్షల వ్యయంతో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఇందుకు స్థానిక ప్రజాప్రతినిధుల సహకారంతో మండల కేంద్రంలోని ప్రకృతి వనంలో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.

కాగా తెలంగాణాలో సీఎం కేసీఆర్ కు ఇది తొలి విగ్రహంగా స్థానికులు భావిస్తున్నారు. మంచిర్యాల జిల్లా దండేపల్లికి చెందిన గుండ రవీందర్ అనే వ్యక్తి 2016లో కేసీఆర్ కు గుడి కట్టించి అందులో విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. కేసీఆర్ వీరాభిమాని అయిన రవీందర్ దండేపల్లిలో పాలరాతితో కేసీఆర్ కు గుడి కట్టించి. అందులో పాలరాతి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అయితే పార్టీలో ఉద్యమకారులకు ప్రాధాన్యతనివ్వడం లేదని ఆరోపిస్తూ రవీందర్ గత జనవరిలో టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారనేది వేరే విషయం. గణపతి విగ్రహం పక్కన కేసీఆర్ విగ్రహాన్ని కూడా ఆయన అభిమానులు కొందరు ఏర్పాటు చేసినట్లు గతంలో వార్తలు వచ్చాయి. కానీ బహిరంగ ప్రదేశంలో సీఎం కేసీఆర్ నిలువెత్తు విగ్రహం ఏర్పాటు కావడం ఇదే తొలి ఘటనగా అధికార పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.

Comments are closed.

Exit mobile version