ఓట్ల లెక్కింపు ప్రారంభమైన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై తెలంగాణా సీఎం కేసీఆర్ భావన ఏమిటి? రాజకీయ వర్గాల్లో జరుగుతున్న తాజా చర్చ ఇది. ఈనెల 14న జరిగిన రెండు ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికల ఫలితాలు అధికార పార్టీకి అనుకూలంగా వచ్చినా, ప్రతికూలంగా వచ్చినా ప్రభుత్వానికి ఇప్పటికిప్పుడు వచ్చిన ముప్పు కూడా ఏమీ లేదు. కానీ ‘షాక్’నిచ్చే ఫలితాలు వస్తే మాత్రం అటు నాగార్జునసాగర్ ఉప ఎన్నిక, ఇటు వరంగల్, ఖమ్మం నగరపాలక సంస్థల ఎన్నికలపై ప్రభావం చూపతుందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అటు హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్, ఇటు వరంగల్, ఖమ్మం, నల్లగొండ ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలను అధికార పార్టీ సవాల్ గా తీసుకుంది. గెలుపే ప్రామాణికంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర నాయకులు సర్వశక్తులూ ఒడ్డారు. కోట్ల రూపాయలను అధికార పార్టీ నేతలు ఈ ఎన్నికల్లో వెదజల్లారనే ఆరోపణలు కూడా వచ్చాయి. అయినప్పటికీ ఈ రెండు స్థానాల్లో గ్రాడ్యుయేట్లు ఇచ్చిన తీర్పుపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి.
వరంగల్, ఖమ్మం, నల్లగొండ స్థానంలో టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం గెలిచే అవకాశాలే మెండుగా ఉన్నట్లు వివిధ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. వేర్వేరు వర్గాల నుంచి ప్రభుత్వం తెప్పించుకున్న నివేదికలు కూడా ఇదే తరహా సారాంశంతో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక్కడ ప్రధాన పోటీ ప్రొఫెసర్ కోదండరాం, టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డిల మధ్యే కొనసాగిందనే వాదన వినిపిస్తోంది. అదేవిధంగా హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ స్థానంలోనూ టీఆర్ఎస్ అభ్యర్థి సురభి వాణీదేవి విజయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక్కడ బీజేపీ అభ్యర్థి రాంచందర్ రావు వైపే మొగ్గు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. రెండు స్థానాల్లో గెలుపు అంశంపై అధికారి పార్టీకి చేదు ఫలితాలు ఎదురైనా ఆశ్చర్యం లేదంటున్నారు.
కానీ సీఎం కేసీఆర్ మాత్రం ఈ రెండు ఎమ్మెల్సీ స్థానాల ఫలితాలపై గట్టి ధీమాతో ఉన్నట్లు తెలుస్తోంది. ‘రెండూ మనవే’ అని సీఎం కేసీఆర్ అత్యంత విశ్వాసంతో ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పార్టీకి చెందిన కొందరు ముఖ్యుల వద్ద కేసీఆర్ ఇదే ధీమాను వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇంతకీ ఈ ఎన్నికల్లో కేసీఆర్ ఆశించిన ఫలితం వెలువడుతుందా? లేదా? అనేది తేలాలంటే మరికొన్ని గంటలు వేచి చూడక తప్పదు.