తన వ్యాఖ్యలపై రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వివరణ ఇచ్చారు. హుజూరాబాద్ నియోజక వర్గంలోని కమలాపూర్ మండలం ఉప్పల్ లో శుక్రవారం నిర్వహించిన పల్లె ప్రగతి సమీక్షలో మహిళా ఎంపీడీవోను ఉద్దేశిస్తూ దయాకర్ రావు చేసిన వ్యాఖ్యల వీడియో వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దయాకర్ రావు ఓ ప్రకటన విడుదల చేస్తూ, తెలంగాణ రాష్ట్ర ప్రగతిలో అధికారుల పాత్ర కీలకమన్నారు. ఉద్దేశ పూర్వకంగా కొన్ని వర్గాలు సంచనాల కోసం ప్రయత్నిస్తున్నాయని, వక్రీకరించే వార్తలు ప్రచారం చేయడం మంచిది కాదన్నారు.
తన సుదీర్ఘ రాజకీయ చరిత్రలో ఉద్యోగులపై, అధికారులపై తనకు గౌరవం ఉందన్నారు. ఆ మహిళాధికారి కుటుంబంతో తనకు సన్నిహిత సంబంధం ఉందని చెప్పారు. అందులో భాగంగానే బాగున్నావా బిడ్డా (కూతురు) అంటూ పలకరించానని చెప్పారు. ఉప్పల్ గ్రామంలో పల్లె ప్రగతి గ్రామ సభకు వెళ్లగానే ఆ అధికారి కుటుంబంతో ఎన్నో యేళ్లుగా ఉన్న సన్నిహిత సంబంధాలతో ఏం బిడ్డా (కూతురు) బాగున్నావా? అంటూ పలకరించినట్లు చెప్పారు. అనంతరం గ్రామంలో పారిశుధ్ధ్య నిర్వహణలో గల లోపాలు, పచ్చదనం పెంపొందించేందుకు చేపట్టిన కార్యక్రమాలు ఏవిధంగా అమలు చేస్తున్నారని అడిగానని చెప్పారు.
తెలంగాణ ఉచ్ఛారణలో భాగంగా మీరు భాగా పనిచేస్తున్నారని, ఇంకా అందరిని ఉరికించి పనిచేయించాలని ప్రొత్సహించినట్లు మంత్రి పేర్కొన్నారు. కానీ కొందరు దాన్ని వక్రీకరించి సోషల్ మీడియాలో సంచనాల కోసం దుష్ప్రచారం చేస్తున్నారని, ఇది వాంఛనీయం కాదన్నారు. ప్రభుత్వం, ఉద్యోగుల మధ్య వైషమ్యాలు సృష్టించేందుకు కొన్ని శక్తులు పనిచేస్తున్నాయని దయాకర్ రావు ఆరోపించారు. ప్రజాస్వామ్యంగా ఎన్నికైన తమకు ఎల్లప్పుడు ఉద్యోగులు, అధికారులతో పాటు, ముఖ్యంగా మహిళా ఉద్యోగులు, మహిళా అధికారులపై గౌరవం ఉంటుందన్నారు. తన సుదీర్ఘ రాజకీయ చరిత్రలో ఉద్యోగులపై, అధికారులపై ఎన్నడూ దురుసుగా ప్రవర్తించలేదని, భవిష్యత్లో కూడా తాను ఉద్యోగులను, అధికారులను గౌరవిస్తానని దయాకర్ రావు స్పష్టం చేశారు.