కాంగ్రెస్ పార్టీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్న ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ముఖ్య అనుచరుని అరెస్టుకు రంగం సిద్ధమైందా? పొంగులేటి కాంగ్రెస్ లో చేరేందుకు భారీ సభ నిర్వహణకు సిద్ధపడుతున్న నేపథ్యంలో ఆయనకు కుడిభుజంగా ప్రాచుర్యంలో గల ఖమ్మం డీసీసీబీ మాజీ చైర్మెన్ మువ్వా విజయ్ బాబును అరెస్ట్ చేసేందుకు సీఐడీ పోలీసులు రంగంలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాజకీయ వ్యవహారాలతో సీఐడీ పోలీసులకు ఎటువంటి సంబంధం లేకపోయినా, తాజాగా మువ్వా విజయ్ బాబుపై నమోదైన ఓ ఎఫ్ఐఆర్ తీవ్ర సంచలనాన్ని కలిగిస్తోంది. డీసీసీబీ చైర్మెన్ గా మొవ్వా విజయ్ బాబు వ్యవహరించిన కాలంలో అనేక అక్రమాలు జరిగినట్లు ఇప్పటికే కొన్ని కేసులు నమోదయ్యాయి. అందుకు సంబంధించిన విచారణలు, కోర్టు స్టే వంటి పరిణామాలు కూడా చోటు చేసుకున్నాయి.
అయితే తాజాగా అంటే ఈనెల 19వ తేదీన విజయ్ బాబుపై సీఐడీ పోలీసులు ఓ కేసు నమోదు చేశారు. వి. శ్రీనివాసరావు అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు విజయ్ బాబుపై ఐపీసీ 403, 406, 420 రెడ్ విత్ 34 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. మువ్వా విజయ్ బాబు 2015-18 కాలంలో డీసీసీబీ చైర్మెన్ గా వ్యవహరించినపుడు కొనుగోలు చేసిన ఓ ప్రముఖ కంపెనీకి చెందిన లాకర్లలో అక్రమాలు జరిగాయన్నది ఫిర్యాదు సారాంశం. ఈ ఫిర్యాదుపైనే సీఐడీ పోలీసులు విజయ్ బాబుపై తాజా కేసు నమోదు చేశారు. తాజాగా సీఐడీ నమోదు చేసిన ఈ కేసులో మొవ్వా విజయ్ బాబు అరెస్టు తప్పదనే ప్రచారం జరుగుతోంది. పొంగులేటి వర్గీయుల్లో ఈ ఘటన తీవ్ర కలకలానికి దారి తీసింది. కాగా బీఆర్ఎస్ పార్టీలో లేకపోవడం వల్లే మువ్వా విజయ్ బాబుపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని డీసీసీబీ డైరెక్టర్, పొంగులేటి మరో ముఖ్య అనుచరుడు తుళ్లూరి బ్రహ్మయ్య అన్నారు.