మీరు ఫొటోలో చూస్తున్న ఇతని పేరు సన్ జిన్రాంగ్..బీజింగ్ నగరంలో అత్యంత ఖరీదైన ప్రయివేట్ డిటెక్టివ్. పరిశోధనకు ఇతను వాడే పరికరాలు కూడా హైటెక్ తరహా మరి. ఓ ఇంటి యజమాని తన పెంపుడు పిల్లి డ్యూడ్యో కనిపించడం లేదని సన్ జిన్రాంగ్ ను ఆశ్రయించాడు. ఇంకేముంది అసలే హైటెక్ డిటెక్టివ్ కదా? తాను వినియోగించే 50 కిలోల పరిశోధనా పరికరాలను…అంటే డిటెక్టివ్ ఎక్విప్ మెంట్ తో కూడిన సూట్ కేస్ ను భుజాన వేసుకుని బయలుదేరాడు. హెడ్ డిటెక్టర్లు, సీసీ కెమెరాలు, మత్తు ఇంజక్షన్లు వగైరా ఇందులో ఉంటాయన్న మాట.

తప్పిపోయిన పిల్లిని వెతుక్కుంటూ వెళ్లిన జిన్రాంగ్ ఓ అండర్ గ్రౌండ్ గ్యారేజీలో అది ఉన్నట్లు గుర్తించాడు. కానీ పిల్లి మాత్రం దొరకలేదు. మళ్లీ పరిశోధన ప్రారంభించాడు. దుమ్ముతో కూడిన ఓ పైప్ మీద పిల్లి అడుగులు ఉన్నట్లు జిన్రాంగ్ గుర్తించాడు. దాని అడుగులను అనుసరిస్తూ వెళ్లిన డిటెక్టివ్ కు ఓ గడ్డి ప్రదేశం కనిపించింది. అక్కడే సీసీ కెమెరాలు అమర్చి, వెంట తెచ్చుకున్న హైటెక్ ఎక్విప్ మెంట్ తో పిల్లి కోసం వేచి చూడసాగాడు. మొత్తానికి రెండ్రోజుల అనంతరం పిల్లి జిన్రాంగ్ పరిశోధన వలకు చిక్కింది.

ఈ పిల్లిని పట్టుకున్నందుకు దాని యజమాని నుంచి ఈ డిటెక్టివ్ జిన్రాంగ్ ఎంత వసూలు చేశాడో తెలుసా? అక్షరాలా 8,000 యాన్స్…అంటే సుమారు 1,130 డాలర్లు. ఈ తరహా పెంపుడు జంతువులు పట్టుకోవడం జిన్రాంగ్ కు కొత్తేమీ కాదు. ఏడేళ్లుగా అతను డిటెక్టివ్ వృత్తిలోనే ఉన్నాడు. షాంఘై లో గల తన కంపెనీలో పది మంది ఉద్యోగులు కూడా ఉన్నారు. ఈ కంపెనీ తరపున ఇప్పటి వరకు తప్పిపోయిన సుమారు వెయ్యి పెంపుడు జంతువుల ఆచూకీ కనిపెట్టారు. పెంపుడు జంతువులను కనిపెట్టడంలో ఈ డిటెక్టివ్ కంపెనీ సక్సెస్ రేట్ 70 శాతం వరకు ఉంది. తమ పెంపుడు జంతువులు తప్పిపోయినట్లు అర్థరాత్రి కూడా తనకు ఫోన్లు వస్తుంటాయని జిన్రాంగ్ ఓ వార్తా సంస్థతో చెప్పాడు. అయితే మాంసం కోసం కుక్కలను కొందరు దుండగులు చోరీ చేస్తుంటారని, అవి తప్పిపోయినట్లు వాటి యజమానులు భావిస్తూ తమ వద్దకు వస్తుంటారని కూడా ఆయన వెల్లడించారు.

Comments are closed.

Exit mobile version