రైతు కోల్డ్ స్టోరేజీని ఎందుకు ఆశ్రయిస్తాడు? ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు ధర లేదని భావించిన పక్షంలో పంటను కోల్డ్ స్టోరేజీల్లో దాచుకుంటాడు. దాని నిర్వాహకులకు నిర్ణీత ధరల ప్రకారం అద్దె కూడా చెల్లిస్తాడు. కానీ ఆపత్కాలంలో పంటను అమ్మకునేందుకు వచ్చిన రైతు పంట స్థితిని చూసి హతాశుడైతే…? అతని గుండె కలవరపడితే…? పరిస్థితి అత్యంత ఆందోళనకరం కదా? ఇందుకు బాధ్యులెవరు? పంట దాచుకున్న రైతా? కిరాయి తీసుకుని ‘చల్ల’గా ఉంచుతానని హామీ ఇచ్చిన కోల్డ్ స్టోరేజ్ నిర్వాహకులా? ఖమ్మంలోని పలు కోల్డ్ స్టోరేజీల్లోని మిర్చి నిల్వలు రైతులకు ఇటువంటి ‘గుండె’నెప్పినే కలిగిస్తున్నాయి. తమ పంట కోల్డ్ స్టోరేజీల్లో ‘చల్ల’గానే ఉందని భావించిన రైతుకు ‘బూజు’ పట్టిన దృశ్యాలు కనిపిస్తున్నాయి. దీంతో రైతాంగం లబోదిబోమంటున్నది.
కరోనా కల్లోల పరిణామాల్లో లాక్ డౌన్ కారణంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని మిర్చి రైతులు తమ పంటను పలు కోల్డ్ స్టోరేజీల్లో నిల్వ చేశారు. పరిస్థితులు చక్కబడ్డాక మిర్చి విక్రయించుకోవచ్చని భావించారు. అయితే కొద్ది రోజుల క్రితం ఓ కోల్డ్ స్టోరేజిలో మిర్చికి బూజు పట్టిన ఘటన రైతులను తీవ్ర ఆందోళనకు గురి చేసింది. దీంతో సంబంధిత అధికారులు రైతులకు ఓ సూచన చేశారు. కోల్డ్ స్టోరేజీల్లో నిల్వ చేసిన పంటను చెక్ చేసుకోవలసిందిగా సూచించారు. దీంతో పలువురు రైతులు ఖమ్మం నగరంలోని కోల్డ్ స్టోరేజీల్లో మంగళవారం తమ మిర్చి బస్తాలను చూసుకుని బావురుమంటున్నారు. మిర్చి నిల్వలకు బూజు పట్టి ఉండడమే ఇందుకు ప్రధాన కారణం.
కోల్డ్ స్టోరేజీల్లో పంట నిల్వ చేసినప్పుడు క్వింటాలు మిర్చి ధర రూ. 12 వేల పైచిలుకు ధర పలికిందని, ప్రస్తుతం నాలుగు వేలు కూడా ఇచ్చే పరిస్థితి లేదన్నారు. ఈ దుస్థితిలోనే కోల్డ్ స్టోరేజీల్లో తమ పంటకు పట్టిన బూజుపై రైతులు ఆందోళన చెందుతున్నారు. ‘బూజు’ పట్టిన అంశంతో తమకు సంబంధం లేదని కోల్డ్ స్టోరేజీల నిర్వాహకులు తేల్చి చెబుతుండడంతో రైతులకు పాలుపోవడం లేదు. అయితే కోల్డ్ స్టోరేజీల నిర్వహణా లోపంతోనే పంటకు బూజు పట్టిందని, ఈ విషయంలో తమను ఆదుకోవాలని రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
ఖమ్మం నగరంలోని ఓ కోల్డ్ స్టోరేజిలో దాచిన మిర్చి పంటకు పట్టిన బూజు దుస్థితి, రైతు ఆవేదనను దిగువన వీడియోలో చూడండి.