‘‘చూస్తే పెద్దాయనలా ఉన్నావ్… ఇదేం పని. ఇదేం తీరు. నీ లాంటి వాళ్లు ఈ రాష్ట్రానికే అన్ ఫిట్. ఏం చేయాలి మిమ్మల్ని? ఎవరూ ఏం చేయలేరన్నారు కదా? ఇదేనా నిర్వాకం? మీలాంటి వారి చేష్టల వల్ల ప్రభుత్వానికి ఎంత అప్రదిష్ట? మీరు మాట్లాడిన టేపులు చాలా ఉన్నాయ్? అన్నీ నేను వినిపించలేను. ఆ భాష ఏమిటి? వెరీ రూడ్. ఎస్ఐ గారూ ఆడియో టేపులను మీకు షేర్ చేస్తాను. మీరు సిన్సియర్ అని విన్నాను. మిమ్మల్ని అభినందిస్తున్నాను. ఇటువంటి వ్యక్తుల వల్ల ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుంది. నేను ప్రాతినిధ్యం వహిస్తున్న చిలకలూరిపేటలో ఇటువంటివి సహించే ప్రసక్తే లేదు’’ అంటూ చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజని ఎక్సైజ్ శాఖకు చెందిన ఓ హెడ్ కానిస్టేబుల్ నిర్వాకంపై నిప్పులు చెరిగారు.

ఇంతకీ విషయం ఏమిటంటే… ఎక్సైజ్ శాఖ గురించి తెలిసిందే కదా? లిక్కర్ దందాపై ఏవేవో ఆరోపణలు వస్తుంటాయి. ఈ విషయంలో సదరు శాఖలో అధికారులు, సిబ్బంది అందరూ ఒకేలా ఉండరనుకోండి. అది వేరే విషయం. కానీ ఓ హెడ్ కానిస్టేబుల్ మాత్రం అక్రమంగా లిక్కర్ అమ్మేవాళ్లతో ఆమ్యామ్యాల వ్యవహారాలకు సంబంధించి నెరపిన సంభాషణ, వాడిన భాషా సౌందర్యానికి సంబంధించిన ఆడియోలు ఎమ్మెల్యేకు చేరాయి. ఇంకేముంది… ఎక్సైజ్ స్టేషన్ ను వెతుక్కుంటూ ఎమ్మెల్యే రజని నేరుగా అక్కడికే వెళ్లారు. హెడ్ కానిస్టేబుల్ నిర్వాకాన్ని స్టేషన్లోనే, సీఐ, ఇతర సిబ్బంది సాక్షిగా కడిగి పారేశారు. ఎమ్మెల్యే రజని ఎక్సైజ్ స్టేషన్ కు వెళ్లి ఆగ్రహించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆ శాఖ ఉన్నతాధికారులు వెంటనే స్పందించి హెడ్ కానిస్టేబుల్ పై సస్పెన్షన్ వేటు వేశారు.

మొత్తం వ్యవహారానికి సంబంధించి చిలకలూరిపేట ఎమ్మెల్యే రజని ఎక్సైజ్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్ తీరును ఎలా ప్రశ్నిస్తూ, కడిగేస్తున్నారో దిగువన వీడియోలో చూడండి.

Comments are closed.

Exit mobile version