ఓ జిల్లా కలెక్టర్ ఓవర్ యాక్షన్ ఫలితంగా సాక్షాత్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి బాధితునికి క్షమాపణ చెప్పిన సంఘటన ఛత్తీస్ గఢ్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెడితే… కరోనా వ్యాప్తి నిరోధానికి లాక్ డౌన్ అమలుకు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఛత్తీస్ గఢ్ ప్రభుత్వం కూడా లాక్ డౌన్ అమలు పరుస్తోంది. అయితే లాక్ డౌన్ అమలు తీరును పర్యవేక్షించేందుకు ఛత్తీస్ గఢ్ లోని సూరజ్ పూర్ కలెక్టర్ రణబీర్ శర్మ రోడ్డుపైకి వచ్చారు. ఈ సందర్భంగా ఓ యువకుడి సెల్ పోన్ ను కలెక్టర్ లాక్కుని నేలకేసి కొట్టారు. అంతేగాక ఆ యువకున్ని చెంపదెబ్బ కొట్టారు. ఈ ఘటనపై తీవ్ర విమర్శలు రావడంతో సాక్షాత్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేష్ భాగెల్ తీవ్రంగా స్పందించారు.
సూరజ్ పూర్ కలెక్టర్ రణబీర్ శర్మ ఓ యువకుడిపట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఘటన తన దృష్టికి వచ్చిందని, ఇది చాలా విచారకరమని, ఖండించదగిన ఘటనగా సీఎం ట్వీట్ చేశారు. ఛత్తీస్ గఢ్ లో ఇటువంటి చర్యను అస్సలు సహించబోమని, కలెక్టర్ రణబీర్ శర్మను వెంటనే విధుల నుంచి తొలగించాలని సీఎం ఆదేశించారు. ఏ స్థాయి అధికారి అయినప్పటికీ ఇటువంటి ప్రవర్తన ఆమోదయోగ్యం కాదని సీఎం అన్నారు. ఈ సంఘటనపట్ల తాను తీవ్రంగా కలత చెందుతున్నానని, బాధిత యువకుడికి, అతని కుటుంబానికి క్షమాపణ చెబుతున్నట్లు సీఎం భూపేష్ పేర్కొన్నారు. కాగా సీఎం ఆదేశం మేరకు సూరజ్ పూర్ కలెక్టర్ గా రణబీర్ శర్మను తొలగిస్తూ, అతని స్థానంలో గౌరవ్ కుమార్ సింగ్ ను నియమిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి.
ఫొటో: యువకునిపై చేయి చేసుకుంటున్న కలెక్టర్ రణబీర్ శర్మ