నేను రెండు రోజుల క్రితం ఒక వీడియో చూశాను. కెమికల్ ఇంజనీర్ అట, ఇంతటి మేధావితనాన్ని నా జీవితంలో మొదటిసారి చూస్తున్నాను. కరోనా గురించి, వైరస్ బిహేవియర్ గురించి ఎంత గొప్పగా చెప్పాడో !!
కృష్ణుడి విశ్వరూపాన్ని సంజయుడు తన దివ్యదృష్టితో చూసి ధృతరాష్ట్రుడికి వర్ణించిన తీరుగా…. కరోనా థర్డ్ వేవ్ ఎంతటి ప్రళయాన్ని సృష్టించనుందో, ఎన్ని కోట్ల ప్రాణాలు బలితీసుకోనుందో ఈయన భవిష్యత్ అంతా తన దివ్యదృష్టితో చూసి వచ్చినట్టు చక్కగా చెప్పేసాడు. ప్రతీ ఇంటికీ ఒక శవం లేస్తుందట (ఒక్కటేనా!! మిగతావారి మీద వైరస్ కి ఎందుకనో అంత కనికరం !! )

మరి దీనికి పరిష్కారం ఏంటని యాంకర్ అడిగితే ఈయనగారి సమాధానం లాక్డౌన్ పెట్టాలట, మామూలుగా పెట్టి వదిలేయడం కాదు, బయట కనిపించిన వాళ్ళను కనిపించినట్టే పిట్టల్ని కాల్చినట్టు కాల్చి పారేయాలట (పిట్టల్ని కాల్చినట్టు ఇదే పదం ) . జనాలు ఒళ్లు బలిసి బయటీకొచ్చి వైరస్ వ్యాప్తి చేస్తున్నారట, వీళ్ళు టెర్రరిస్ట్ లతో సమానం అట, వీళ్ళను చంపడం తప్పే కాదట. దీన్ని యుద్ధంలా భావించి బయటికి వచ్చిన వాళ్ళను చంపిపారేస్తేనే కరోనా పోతుందట !!!

అసలేంటిది !!? ఈయనకు ఏమైనా సబ్జెక్ట్ తెలుసా? ! కెమికల్ ఇంజనీర్ కి వైరాలజీ, ఇమ్మ్యూనాలజీ, పాండమిక్స్ తో సంబంధం ఏంటి? ఈ పిట్టలదొర లెక్క ప్రకారం కనిపించిన వాళ్ళను కాల్చి చంపాలంటే గత ఏడాది లాక్డౌన్ లో లక్షలాది వలస కూలీలను కాల్చి చంపేయాలి, వాళ్లంతా ఒళ్ళు బలిసి రోడ్డు మీద తిరిగారన్న మాట. వాళ్లంతా టెర్రరిస్ట్ ల మాదిరి ప్రమాదకరమైన వారు. వీళ్లందర్నీ అప్పుడే చంపి ఉంటే మనకు ఈ రోజు ఈ బాధ ఉండేది కాదు.
ఒక్క రోజు కూలి దొరక్కపోతే కలే కడుపుతో అల్లాడిపోయే బతుకుల గురించి కడుపు నిండి కొంపలో పడి సోది కబుర్లు చెప్పేవారికి ఎలా తెలుస్తుంది? ! మిడిమిడి జ్ఞానంతో ప్రజల్ని భయ భ్రాంతులకు గురిచేసి చంపే వీళ్ళు కదా టెర్రరిస్ట్ లు.

నేషనల్ ఇన్స్టిట్యూట్ అఫ్ ఎపిడెమాలజి చైర్మన్ ప్రఖ్యాత ఎపిడెమోలోజిస్ట్ డాక్టర్ జై ప్రకాష్ ములియల్ గారు లాక్డౌన్ వల్ల నష్టమే గానీ ఉపయోగం ఏమీ ఉండదు. కరోనా ఏమాత్రం ప్రమాదకరం కాదు కాబట్టి జనాల్ని దూరంగా ఉంచడం కాదు social gatherings ఇంకా ఎక్కువ చేసి వైరస్ ఎక్కువ మందికి సోకేలా చూడాలి అప్పుడే హెర్డ్ ఇమ్మ్యూనిటి తొందరగా వస్తుంది అని లాస్ట్ ఇయర్ లాక్డౌన్ కి ముందు చెప్పారు. అంటే ఈయనకు సైన్స్ తెలియదా. ఎపిడెమిక్, పాండెమిక్ గురించి ఎపిడెమాలజిస్ట్ కంటే కెమికల్ ఇంజనీర్ గారికే ఎక్కువ తెలుసన్న మాట !!

సబ్జెక్ట్ తెలిసిన వాళ్ళకీ, సబ్జెక్ట్ తెలియని వాళ్ళకీ విషయ పరిజ్ఞానంలో కానీ, చెప్పిన విధానంలో కానీ ఎంతటి తేడానో గమనించండి ! రెండూ వ్యతిరేకభావాలు. ఏ రంగానికి చెందిన విషయాలు ఆ రంగానికి చెందిన వాళ్ళు చెప్పాలి. సైన్స్, హెల్త్ విషయాలైతే మరీ… కరోనా గురించి మైక్రో బయాలజిస్ట్, వైరాలజిస్ట్, ఎపిడెమాలజిస్ట్, ఇమ్మ్యునాలజిస్ట్ లు చెప్పాలి గానీ … కెమికల్ ఇంజనీర్, మెకానికల్ ఇంజనీర్, సివిల్ ఇంజనీర్లు చెబితే ఇలానే ఉంటుంది.

అయినా తప్పు వీళ్లది కాదు, సబ్జెక్ట్ తో సంబంధం లేనివారిని డిబేట్లలో కూర్చోబెట్టి, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాగుతూ తప్పుడు ఇన్ఫర్మేషన్ తో జనాల్ని భయపెట్టి చంపుతున్నా… కార్యక్రమం నిర్వహించేవాళ్లకు సబ్జెక్ట్ మీద కనీస అవగాహన లేకుండా ఎలాంటి ప్రశ్నలు అడగాలో కూడా చేతగాని సిగ్గులేని మీడియాదే !.

  • ✍️ Vanaja Che

Comments are closed.

Exit mobile version