ఈనెల 21వ తేదీన ఛత్తీస్ గఢ్ లోని సుక్మా జిల్లా కసల్పాడ్-ఎల్మాగూడ అడవుల్లో పోలీసులకు, నక్సలైట్లకు మధ్య జరిగిన భారీ ఎన్కౌంటర్ ఘటనలో ముగ్గురు మావోయిస్టులు కూడా మరణించారు. ఇదే ఘటనలో 17 మంది ఎస్టీఎఫ్, డీఆర్జీ భద్రతా బలగాలకు చెందిన పోలీసులు మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి వికల్ప్ పేరుతో ఓ ఆడియోతో కూడిన ప్రకటన, ఎన్కౌంటర్ ఘటన అనంతర ఫొటోలను మీడియాకు విడుదల చేశారు.
ఎన్కౌంటర్ ఘటనలో 17 మంది పోలీసులు ప్రాణత్యాగం చేసినట్లు, భారీగా నక్సలైట్లకూ ప్రాణనష్ట జరిగినట్లు ఛత్తీస్ గఢ్ ప్రభుత్వం ప్రకటించగా, పీపుల్స్ గెరిల్లా ఆర్మీ జరిపిన దాడిలో 19 మంది పోలీసులు మరణించారని, మరో 20 మంది గాయపడ్డారని వికల్ప్ ప్రకటించడం గమనార్హం. ఈ ఘటనలో పోలీసుల నుంచి 11 ఏకే-47, రెండు ఇన్సాఫ్ రైఫిల్స్, ఎస్ఎల్ఆర్, ఎల్ఎమ్జీ ఒక్కోటి చొప్పున స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ఇంకా అనేక రకాల ఆయుధాలను, ఇతర ఆయుధ సామాగ్రిని తాము హస్తగతం చేసుకున్నామన్నారు. ఎన్కౌంటర్ ఘటనలో పీఎల్జీఏకు చెందిన సక్రు, రాజేష్, సుక్కు అనే సహచరులను కోల్పోయామన్నారు. వీరంతా బీజాపూర్ జిల్లాకు చెందినవారని వికల్ప్ పేర్కొంటూ మరణించిన ఆయా నక్సల్స్ అంత్యక్రియల ఫొటోలను, పోలీసుల నుంచి స్వాధీనం చేసుకున్న ఆయుధాల ప్రదర్శన చిత్రాలను కూడా విడుదల చేశారు.