తుపాకీ భుజాన ధరించి అడవుల్లో కనిపిస్తున్న ఈ యువతి పేరు సునైనా పటేల్. ఛత్తీస్ గఢ్ లోని డిస్ట్రిక్ట్ర్ రిజర్వ్ గార్డ్ (డీఆర్జీ) పోలీసు బలగాల్లో స్పెషల్ మెంబర్ (కమాండర్). మావోయిస్టు నక్సల్స్ అణచివేత ప్రక్రియలో భాగంగా ఛత్తీస్ గఢ్ ప్రభుత్వం మహిళా పోలీసులతో ఓ ప్రత్యేక ‘టీమ్’ను ఏర్పాటు చేసింది. ఇందులో మహళా కానిస్టేబుళ్లతోపాటు లొంగిపోయిన మహిళా నక్సలైట్లు కూడా ఉంటారు. ఈ మహిళల ‘టీమ్’కు ‘దంతేశ్వరి ఫైటర్స్’గా నామకరణం చేశారు. దంతెవాడ కేంద్రంగా ఈ స్పెషల్ టీమ్ తనకు నిర్దేశించిన విధులను నిర్వహిస్తుంది.

తుపాకీ ధరించిన సునైనా పటేల్ కూడా ఒకప్పుడు మావోయిస్టు నక్సలైటే. నిరుడు ప్రభుత్వానికి లొంగిపోయి జనజవన స్రవంతిలో కలిశారు. మావోయిస్టులపై యుద్ధం చేసే ‘దంతేశ్వరి ఫైటర్స్’ మహిళా టీమ్ కు సునైనా పటేల్ నాయకత్వం వహిస్తున్నారు. ఛత్తీస్ గఢ్ లో మావోయిస్టులపై యుద్ధం చేసేందుకు సల్వాజుడుం వంటి ప్రయివేట్ సైన్యాన్ని ఉపయోగించిన చరిత్ర అక్కడి పాలకులకు ఉంది. లొంగిపోయిన నక్సలైట్లను పోలీసుశాఖలో విధులు కేటాయించి మావోయిస్టులపైకి యుద్ధాని పంపడం కూడా కొత్త విషయమేమీ కాకపోవచ్చు.

కానీ ఫొటోను మరోసారి నిశితంగా పరిశీలించండి. భుజనా తుపాకీతో అడవుల్లో కనిపిస్తున్న సునైనా పటేల్ ఏడు నెలల గర్భవతి కావడమే ఈ వార్తా కథనపు ప్రత్యేకత. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఛత్తీస్ గఢ్ మీడియాతోపాటు జాతీయ వార్తా సంస్థలు ఈ ఫొటోకు ప్రాధాన్యతనిస్తూ పలు వార్తా కథనాలను వెలువరించడం విశేషం. తాను ఏడు నెలల గర్భంతో ఉన్నప్పటికీ, నక్సల్స్ పై యుద్ధం చేసేందుకు సునైనా పటేల్ విద్యుక్త ధర్మాన్ని విస్మరించలేదన్నది దంతెవాడ పోలీసు అధికారుల అభిప్రాయం. సునైనా పటేల్ స్ఫూర్తికి తాను వందనం చేస్తున్నట్లు దంతెవాడ ఎస్పీ అభిషేక్ పల్లవ్ ఈ సందర్భంగా వ్యాఖ్యనించారు.

Comments are closed.

Exit mobile version