తెల్లని దుస్తులు ధరించి శవపేటికలో గల ఓ డెడ్ బాడీని మోస్తున్న ఈయన పేరు భూపేష్ బాఘెల్. మన తెలుగు రాష్ట్రాల పక్కనే గల ఛత్తీస్ గఢ్ రాష్ట్ర ముఖ్యమంత్రి. చైనా దురాగతానికి బలైన 20 మంది భారతీయ సైనికుల్లో ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలోని కాంకేర్ జిల్లాకు చెందిన జవాన్ గణేష్ రామ్ కుంజన్ కూడా ఉన్నారు.
గణేష్ రామ్ మృతదేహాం స్వామి వివేకానంద ఎయిర్ పోర్టుకు చేరుకున్న సందర్భంగా సీఎం భూపేష్ స్వయంగా వెళ్లి అతనికి నివాళులర్పించారు. శవపేటికలో గల ఆర్మీ జవాన్ గణేష్ రామ్ కుంజన్ డెడ్ బాడీని తన భుజంపై వేసుకుని స్వయంగా మోశారు.
అంతేకాదు వీరమరణం పొందిన ఆ సైనికుడి కుటుంబానికి రూ. 20 లక్షల మొత్తాన్ని ఎక్స్ గ్రేషియాగా ప్రకటించారు. అతని కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తామని, గణేష్ రామ్ స్వగ్రామంలోని పాఠశాలకు అతని పేరు పెడతామని కూడా ఛత్తీస్ గఢ్ సీఎం భూపేష్ ప్రకటించారు.
కాగా సీఎం భూపేష్ బాఘెల్ వీరమరణం పొందిన సైనికుడు గణేష్ రామ్ డెడ్ బాడీని స్వయంగా మోస్తున్న ఫొటో ప్రస్తుతం జాతీయ స్థాయిలో వైరల్ గా మారింది. చర్చకు దారి తీసింది కూడా. ఎందుకూ… అంటే? తన రాష్ట్ర సైనికుడికి ఆ సీఎం అర్పించిన నివాళి దృశ్యమే అందుకు ప్రధాన కారణం.