తెలంగాణా సీఎం కేసీఆర్ తన మంత్రివర్గ సభ్యులను మార్చబోతున్నారా? కొందరిని తొలగించి, మరికొందరికి పట్టం కట్టబెట్టబోతున్నారా? దుబ్బాక ఉప ఎన్నిక ఫలితం అనంతరం కేబినెట్ పునర్వ్యవస్థీకరణపై ముఖ్యమంత్రి దృష్టి సారించనున్నారా? ఔననే అంటోంది అధికార పార్టీ అనుకూల పెద్దలకు చెందిన 10 టీవీ న్యూస్ ఛానల్. నిన్న దుబ్బాక ఉప ఎన్నిక ముగిసిందే తడవుగా ఈ అంశంపై ఆయా న్యూస్ ఛానల్ పలు వార్తా కథనాలను ప్రసారం చేయడం విశేషం.
వాస్తవానికి ఈ తరహా వార్తా కథనాలు గత మూడు, నాలుగు రోజులుగా చిన్నా, చితకా ఆన్ లైన్ పత్రికల్లో వస్తూనే ఉన్నాయి. ‘రాసలీలల’ వివాదంలో చిక్కుకున్న ఓ మంత్రిని తొలగిస్తారని, ఇదే సందర్భంలో పనిలో పనిగా మరికొందరిని కూడా పక్కన పెడతారనే ప్రచారం జరుగుతోంది. రాసలీలల వివాదాన్ని ఎదుర్కుంటున్న మంత్రిని తొలగించి అదే సామాజిక వర్గానికి చెందిన వారికి మంత్రి పదవిని కట్టబెడతారనేది ఆయా ప్రచారపు సారాంశం. ఇందుకు సంబంధిచి ఇద్దరు ఎమ్మెల్యేల పేర్లు కూడా ప్రచారంలోకి వచ్చాయి. అదేవిధంగా ఉత్తర తెలంగాణాలో ఇద్దరికి, దక్షిణ తెలంగాణాలో ఒకరికి సీఎం కేసీఆర్ తన కేబినెట్ నుంచి ఉద్వాసన పలకనున్నట్లు కూడా ప్రచారం జరుగుతోంది.
సోషల్ మీడియాలోగాని, చిన్నా, చితకా పత్రికల్లోగాని వచ్చే ఈ తరహా వార్తా కథనాల గురించి ఎవరూ పెద్దగా పట్టించుకోకపోవచ్చు. కానీ రూలింగ్ పార్టీ కనుసన్నల్లో గల 10 టీవీలో మంత్రివర్గంలో మార్పులంటూ వచ్చిన వార్తా కథనాలు సహజంగానే ప్రాధాన్యతను సంతరించుకుంటాయి. ఎందుకంటే… మంత్రి రాసలీలల వివాదాన్ని భారీ ఎత్తున ప్రసారం చేసినా, మంత్రివర్గంలో మార్పు, కూర్పుల గురించి చెప్పినా అది కొందరు ప్రభుత్వ పెద్దల ‘గ్రీన్’ సిగ్నల్ మేరకే… అనే అభిప్రాయాలు ఉన్నాయి. అదీ అసలు విషయం.