ఔను… ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి చెందిన సాక్షి పత్రిక మరోసారి తన పద్ధతిని మార్చుకుంది. ఓ నిర్ణయాన్ని తీసుకుని పదే పదే ‘పీఛే ముడ్’ తరహా పద్ధతిని అనుసరించడం ఆ పత్రిక ముఖ్య బాధ్యులకు కొత్తేమీ కాదు. కానీ అదే పనిగా ఇటువంటి నిర్ణయాలతో తన పాఠకులను అయోమయంలో పడేయడంపైనే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తెలుగు పత్రికా ప్రపంచంలో అత్యధిక సర్క్యులేషన్ ట్యాగ్ గల ‘ఈనాడు’ను దాటేయాలనే తపనతో మొదలైన సాక్షి తన ప్రస్థానంలోని 13వ యేట కూడా ఓ స్థిర నిర్ణయాన్ని అనుసరించకపోవడమే అసలు విశేషం.
ప్రారంభంలోనే సాక్షి అనేక ప్రయోగాలు చేసింది. తొలుత జిల్లా ఎడిషన్లు, ఆ తర్వాత కొద్ది కాలానికే బ్రాడ్ షీట్ (మెయిన్ ఎడిషన్ లోనే కొన్ని పేజీలతో జిల్లా వార్తలు అందించడం) పద్ధతిని ప్రవేశపెట్టారు. విదేశాల్లో పత్రికలు ఇలాగే ఉంటాయంటూ అప్పట్లో ముఖ్య బాధ్యతల్లో గల వ్యక్తులు పత్రిక రూపానికి పదే పదే మార్పులు చేశారు. ఈ వ్యవహారంలో రూ. కోట్ల మేర ఆర్థిక భారం పడినట్లు ప్రచారం జరిగినా ఆయా విధానానికి ఆద్యులైనవారు మరింత అందలం ఎక్కడమే సాక్షిలోని ప్రత్యేకత. ఓ జిల్లా యూనిట్ కు నాయకత్వం వహించే ముఖ్యుల్లో ఒకరైన ఎడిషన్ ఇంచార్జి అక్కడ విధుల్లో ఫెయిలైతే అతన్ని ‘సెంట్రల్ డెస్క్’లోకి పంపి మరింత ఉన్నత పోస్టులో నియమించడంలోనూ సాక్షి నిర్వహణలో వినూత్న శైలిగా పలువురు అభివర్ణిస్తుంటారు. ఈ తరహా ఉదంతాలు ఓ ఉదాహరణ మాత్రమే.
ఇటువంటి అనేక అంశాల్లో ‘తత్తర…బిత్తర’ విధానాలను అనుసరిస్తుందనే ప్రచారంగల సాక్షి పత్రిక మరోసారి తన రూపాన్ని మార్చుకుంది. కరోనాకు ముందు తెలుగు మీడియాలోని అనేక ప్రముఖ పత్రికలు జిల్లా ఎడిషన్లతో కళకళలాడాయి. కరోనా కారణంగా పత్రికల సర్క్యులేషన్లపై తీవ్ర ప్రభావం పడడం, యాడ్ రెవెన్యూ కూడా భారీగా తగ్గడంతో ఆర్థిక భారాన్ని మోయలేక ‘ఈనాడు’ వంటి పత్రిక యాజమాన్యం సైతం జిల్లా ఎడిషన్లను ఎత్తేసింది. మెయిన్ ఎడిషన్ లోనే అవసరాలకు అనుగుణంగా కొన్ని పేజీల్లో జిల్లా వార్తలకు స్థానం కల్పిస్తోంది. ఈనాడుతోపాటు ఆంధ్రజ్యోతి పత్రిక కూడా ఇప్పటికీ ఇదే విధానాన్ని అనుసరిస్తున్నాయి. సాక్షి కూడా కొన్నాళ్లపాటు కరోనాలో జిల్లా ఎడిషన్లకు మంగళం పాడింది. కానీ మధ్యలో అకస్మాత్తుగా మళ్లీ జిల్లా ఎడిషన్ల ప్రచురణకే మొగ్గు చూపింది.
పొరుగున గల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆ పత్రిక యాజమాన్యానికి చెందిన పార్టీ అధికారంలో ఉండడమో, మరే ఇతర కారణాలవల్లనోగాని ఆర్థిక భారాన్ని బేఖాతర్ చేస్తూ తిరిగి జిల్లా ఎడిషన్లను ముద్రించే సాహసానికి పూనుకుంది. ఎనిమిది పేజీలతో వీటిని సరిపుచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ సర్కార్ అధికారంలో ఉన్నప్పటికీ, ఎంతగా సంస్థకు అర్థబలం ఉన్నప్పటికీ రెగ్యులర్ రెవెన్యూ లేకుంటే ప్రస్తుత పరిస్థితుల్లో పత్రిక నిర్వహణ రోజురోజుకూ భారమే. ఈ విషయంలో సాక్షి ముఖ్యులకు తత్వం బోధపడినట్లుంది. అందుకే కాబోలు శుక్రవారం నుంచి జిల్లా ఎడిషన్లకు సాక్షి పత్రిక మరోసారి టాటా చెప్పేసింది. ‘నేటి నుంచి జిల్లా అనుబంధం మెయిన్ లో’ అంటూ తన పాఠకులకు ఫస్ట్ పేజీలోనే ఇండికేషన్ ఇచ్చింది. అదీ విషయం.