రామగుండం పోలీస్ కమిషనర్ గా ఎస్. చంద్రశేఖర్ రెడ్డి నియమితులయ్యారు. ప్రస్తుతం సీఐడీ విభాగంలో డీఐజీగా, సంగారెడ్డి ఎస్పీగా పూర్తి అదనపు బాధ్యతల్లో గల చంద్రశేఖర్ రెడ్డి 2004 బ్యాచ్ కు చెందిన ఐపీఎస్ అధికారి. వాస్తవానికి నిన్న జరిగిన ఇద్దరు ఐపీఎస్ అధికారుల బదిలీల్లో రామగుండం పోలీస్ కమిషనర్ గా నాన్ కేడర్ ఎస్పీ ఎం. రమణ కుమార్ ను ప్రభుత్వం నియమించింది. అయితే ఈ ఉత్తర్వు వెలువడిన కొద్ది గంటల్లోనే ఆయన పోస్టింగ్ ను మారుస్తూ మరో ఉత్తర్వు వెలువడడం గమనార్హం.

వాస్తవానికి డీఐజీ కేడర్ ఐపీఎస్ అధికారి హోదాగల రామగుండం సీపీ పోస్టింగ్ లో నాన్ కేడర్ ఎస్పీ రమణ కుమార్ ను నియమించడంపై ఐపీఎస్ అధికార వర్గాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనట్లు ప్రచారం జరుగుతోంది. ఈ పరిణామాల్లోనే రామగుండం సీపీగా ఐపీఎస్ అధికారి చంద్రశేఖర్ రెడ్డిని నియమిస్తూ ఉత్తర్వు జారీ అయినట్లు సమాచారం. కాగా రమణ కుమార్ ను సంగారెడ్డి ఎస్పీగా నియమిస్తూ తాజా ఉత్తర్వులు వెలువడ్డాయి.

Comments are closed.

Exit mobile version