కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి మంగళవారం వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఎర్ర బస్సు తప్ప ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాల ప్రజలకు రైళ్ల గురించే తెలియదంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా కలకలం కలిగిస్తున్నాయి. రైల్వే అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అలవాటు లేదని, తెలియదని అన్నారు. అదే విధంగా ‘ఎర్ర బస్సు’ తప్ప నో రైల్వే ట్రెయిన్స్ ఇన్ ది తెలంగాణా ఏరియా… ఓన్లీ రెడ్ బస్సెస్ మాత్రమే అలవాటు ఉండేటువంటి పరిస్థితుల్లో… ఈరోజు నరేంద్ర మోదీగారి ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేకమైనటువంటి…’ అంటూ కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి.
శాటిలైట్ టర్మినల్ చర్లపల్లి స్టేషన్ అభివృద్ధి పనులకు మంగళవారం జరిగిన శంకు స్థాపన కార్యక్రమంలో రైల్వే మంత్రి పీయూష్ గోయల్ తోపాటు కిషన్ రెడ్డి కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో కిషన్ రెడ్డి ప్రసంగిస్తూ చేసిన వ్యాఖ్యలు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ వేడికి కారణమయ్యాయయి. ప్రధాని నరేంద్ర మోదీ పుట్టక ముందే ఉభయ తెలుగు రాష్ట్రాల్లో రైల్వే లైన్లు, రైళ్ల రాకపోకలు ఉన్నాయనే వ్యాఖ్యలు ఈ సందర్భంగా వినిపిస్తున్నాయి. బ్రిటిష్ కాలంలో నిర్మించిన ప్రధాన రైల్వే లైన్ ఆంధ్రప్రదేశ్ నుంచి సికింద్రాబాద్ వరకు ఉందని పలువురు గుర్తు చేస్తున్నారు. ఖమ్మం, వరంగల్ మీదుగా సికింద్రాబాద్ వరకు గల రైల్వే లైన్ వంటి అనేక మార్గాలను ఈ సందర్భంగా విపక్ష రాజకీయ పార్టీల నేతలు గుర్తు చేస్తున్నారు. చర్లపల్లిలో జరిగిన కార్యక్రమంలో రైళ్లు, ఎర్రబస్సు అంశాలపై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ఏమన్నారో దిగువన గల వీడియోలో చూడండి.