కరోనా నియంత్రణకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం తాజాగా కీలక సూచన చేసింది. ముఖ్యంగా మాస్క్ ధరించే విషయంలో అనుసరించాల్సిన విధానంపై ముఖ్యాంశాన్ని వెల్లడించింది. ఇంట్లో ఉన్నప్పటికీ మాస్క్ ధరించాల్సిన సమయం వచ్చేసిందని పేర్కొంది. ఇంట్లో ఉన్నప్పటికీ మాస్క్ ధరించాల్సిన సమయం వచ్చిందని, ఎవరినీ ఆహ్వానించవద్దని, అనవసరంగా బయట కూడా తిరగవద్దని నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్ పేర్కొన్నారు. కుటుంబంలో ఒకరికి కరోనా పాజిటివ్ రిజల్ట్ వస్తే ఆ వ్యక్తి ఇంట్లో మాస్క్ ధరించి ఉండాల్సిందేననని, లేనిపక్షంలో ఇతర కుటుంబ సభ్యులకూ వైరస్ సంక్రమించే అవకాశముందన్నారు. కాగా మాస్క్ ధరించకుంటే రిస్క్ ఎక్కువగా ఉంటుందని కేంద్ర ఆరోగ్యశాఖ అదనపు కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు. దేశంలో కరోనా తాజా పరిస్థితిపై ఆయా అధికారులు మీడియా సమావేశంలో మాట్లాడుతూ పలు ముఖ్యాంశాలను వెల్లడించారు.