నిన్నటి నుంచి వాట్సాప్ గ్రూపుల్లో తెగతిరుగుతున్న పోస్టు ఇది. ముందు దీన్ని చదవండి. తర్వాత అసలు విషయంలోకి వెడదాం.
జర్నలిస్టు మిత్రులుకు ముఖ్య గమనిక కేంద్ర ప్రభుత్వ సాయం అందిస్తుంది.
కొవిడ్ బారినపడిన జర్నలిస్టులకు కేంద్ర ప్రభుత్వం 50,000 రూపాయల నుంచి లక్ష రూపాయల వరకు ఆర్థిక సహాయం అందజేస్తున్నది.
చికిత్స పొంది డిశ్చార్జి అయిన జర్నలిస్టులు ధ్రువీకరణ పత్రాలతో కింద తెలియజేసిన లింక్ లో ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.
జర్నలిస్టులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. కొవిడ్ బారినపడి మృతి చెందిన జర్నలిస్టులకు కేంద్ర ప్రభుత్వం 5 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం అందజేస్తుందని, దీనికి సంబంధించిన వివరాలకు క్రింది సైటులో సంప్రదించగలరు.
http://pibaccreditation.nic.in/jws/default.aspx
ఇక అసలు విషయంలోకి వస్తే… కోవిడ్-19 వ్యాధి బారినపడిన జర్నలిస్టులకు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం అందజేస్తున్నదని, చికిత్స పొంది డిశ్చార్జి అయిన జర్నలిస్టులు ధ్రువీకరణ పత్రాలతో పోస్టులో ఇచ్చిన లింక్ లో దరఖాస్తు చేసుకోవాలని చెప్తూ ఒక లింక్ తో కూడిన పోస్టును సోషల్ మీడియాలో చాలా మంది షేర్ చేస్తున్నారు. కరోనా కల్లోల పరిస్థితుల్లో చిన్న సాయం లభించినా చాలనే ఆశతో జర్నలిస్టులు ఎదురుచూస్తున్నారన్నది వాస్తవం. కరోనా బారిన పడిన జర్నలిస్టుల అంశంలో అటు యాజమాన్యంపరంగా, ఇటు ప్రభుత్వపరంగా గట్ట భరోసా లేకపోవడమే ఇందుకు కారణం కావచ్చు. కానీ..,
పోస్టులో ఇచ్చిన లింక్ ‘Journalists Welfare Scheme’ (జర్నలిస్టుల సంక్షేమ పథకం) కి సంబంధించినది. అది ఒక పాత పథకం. దాంట్లో కోవిడ్-19 కి సంబంధించిన వివరాలు లేవు.
పీఐబీ (ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో) అధికారులను FACTLY సంప్రదించగా, కోవిడ్-19 వ్యాధి బారినపడిన జర్నలిస్టులకు యాభై వేల రూపాయల నుంచి లక్ష రూపాయల వరకు ఆర్థిక సహాయం చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఎటువంటి కొత్త పథకం మొదలు పెట్టలేదని తెలిపారు.
అయితే పాత పథకం ‘Journalists Welfare Scheme’ ద్వారా కోవిడ్-19 తో చనిపోయిన జర్నలిస్టుల కుటుంబాలకి మరియు కోవిడ్-19 చికిత్స ఖర్చు కొరకు ప్రధాన వ్యాధుల (‘major ailments’) కింద జర్నలిస్టులకు ఆర్ధిక సహాయం ఇచ్చే అవకాశం ఉందని, కానీ ఇప్పటివరకు దానిపై తాము ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని తెలిపారు.
అందువల్ల ప్రత్యేక పథకం ద్వారా జర్నలిస్టులకు యాభై వేల రూపాయల నుంచి లక్ష వరకు ఆర్థిక సహాయం, అందరు జర్నలిస్టులకి కోవిడ్-19 చికిత్సకి కూడా జర్నలిస్టుల సంక్షేమ పథకం వర్తిస్తుందని పేర్కొంటూ ఈ పోస్టు ద్వారా తప్పుదోవ పట్టిస్తున్నారట. ఈ పోస్టు కూడా తాజాగా వాట్సాప్ గ్రూపుల్లో సంచరిస్తోంది. అదీ అసలు విషయం.