‘‘రవాణా శాఖ రాష్ట్ర పునర్విభజన చట్టం తొమ్మిదో షెడ్యూల్లో ఉంది. ఆర్టీసీ విషయంలో ఏపీ, తెలంగాణా మధ్య కొంత వివాదం ఉంది. వివాదాస్పద విషయాలను పెండింగ్ లో ఉంచి, ఎవరి కార్పొరేషన్ వాళ్లు నడుపుకునేలా కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దాన్ని రెండు ప్రభుత్వాలు నోటిఫై చేశాయి. ఇప్పుడు ఉన్నది తెలంగాణా ఆర్టీసీ. టీఎస్ఆర్టీసీలో కేంద్రానికి 31 శాతం వాటా ఉంది. ఆ మేరకు నష్టాలకు సంబంధించి డబ్బు ఇవ్వాలని కేంద్రాన్ని అడుగుతాం. గడచిన ఐదేళ్లలో వచ్చిన నష్టాలను పంచుకోవాలని కేంద్రాన్ని అడుగుతాం. చేతులు కడుక్కుంటారా? డబ్బులు ఇస్తారా? చూస్తాం.’’ ఈనెల 2వ తేదీన తెలంగాణా ముఖ్యమంత్రి ఆర్టీసీ సమ్మె అంశంలో కేంద్ర ప్రభుత్వం గురించి చేసిన వ్యాఖ్యలివి. అయితే…

అనూహ్యంగా తెలంగాణా ఆర్టీసీ సమ్మె అంశంలో కేంద్ర ప్రభుత్వం గురువారం ఎంటరైంది. ఆర్టీసీ విభజన జరగలేదని స్వయంగా హైకోర్టుకే నివేదించింది. అసలు టీఎస్ఆర్టీసీకి చట్టబద్ధత లేదని స్పష్టం చేసింది.  ఏపీఎస్ ఆర్టీసీలో కేంద్రానికి 33 శాతం వాటా ఉందని, ఆర్టీసీ విభజన అంశం కేంద్రం వద్ద పెండింగ్ లోనే ఉందని, విభజన జరగని ఏపీఎస్ ఆర్టీసీ నుంచి కేంద్రం వాటా టీఎస్ఆర్టీసీకి బదిలీ కాబోదని కేంద్రం తరపున అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ రాజేశ్వరరావు హైకోర్టులో వాదనలు వినిపించారు. విభజన అంశం పెండింగ్ లో ఉండగా కొత్త ఆర్టీసీ సంస్థ ఏర్పాటు ఎలా సాధ్యమని హైకోర్టు ఆర్టీసీ ఇంచార్జ్ ఎండీ సునీల్ శర్మను ప్రశ్నించింది. పునర్విభజన చట్టంలోని సెక్షన్ 3 ప్రకారం టీఎస్ఆర్టీసీని ఏర్పాటు చేశామని సునీల్ శర్మ నివేదించారు. మొత్తానికి ఏపీఎస్ఆర్టీసీ విభజన జరగలేదని ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ నేత అశ్వత్థామరెడ్డి చేస్తున్న వాదనకు కేంద్రం తరపున ఏసీజీ చేసిన వాదన బలం చేకూర్చినట్లు పరిశీలకులు భావిస్తున్నారు.

ఇదిలా ఉండగా ఆర్టీసీ సమ్మె విచారణ సందర్భంగా తెలంగాణా హైకోర్టు ఐఎఎస్ అధికారులు తీరుపై ఒకింత అసహనం, మరింత ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. కోర్టుకు సమర్పించిన నివేదికలు పరస్పర విరుద్ధంగా ఉన్నాయని, ఉద్దేశపూర్వకంగా తప్పుడు నివేదికలు ఇస్తే కోర్టు ధిక్కరణ కిందకు వస్తుందనే విషయం తెలుసా? అని ప్రశ్నించింది. ఐఏఎస్‌ అధికారులు అసమగ్రంగా నివేదికలు ఇవ్వడం ఆశ్చర్యంగా ఉందని వ్యాఖ్యానించింది. రికార్డులు పరిశీలించాకే నివేదిక ఇస్తున్నట్లు ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి స్పష్టం చేయగా, మొదటి నివేదిక పరిశీలించకుండానే ఇచ్చారా? అని హైకోర్టు నిలదీసింది. ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి రామకృష్ణారావు వివరణ ఇస్తూ, సమయాభావం వల్ల రికార్డుల ఆధారంగా నివేదిక రూపొందించామని, మన్నించాలని హైకోర్టును అభ్యర్థించగా, క్షమాపణ కోరడం సమాధానం కాదని వాస్తవాలు చెప్పాలని హైకోర్టు సూచించింది. అధికారుల తీరుపై హైకోర్టు తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేస్తూ, మీరు చెబుతున్న అంకెలు వేర్వేరుగా ఉన్నాయి…మేం వీటిని పరిగణనలోకి తీసుకోవాలా? అని ప్రశ్నించింది. కోర్టును తప్పుదోవ పట్టించేందుకు తెలివిగా గజిబిజి లెక్కలు.. పదాలు వాడారని హైకోర్టు వ్యాఖ్యానించింది. రుణ పద్దుల కింద కేటాయించిన నిధులు అప్పు కాదని, గ్రాంటు అని తెలివిగా చెబుతున్నారని, ఇంతవరకు ఏ బడ్జెట్ లో అలా చూడలేదని హైకోర్టు పేర్కొంది. మంత్రికి తప్పుడు లెక్కలు ఇస్తే ప్రభుత్వాన్ని ఛీట్ చేసినట్లేనని, క్యాబినెట్ కి సైతం అధికారులు తప్పుడు లెక్కలు ఇచ్చారని, తప్పడు లెక్కలతో ముఖ్యమంత్రితోనూ అధికారులు స్టేట్ మెంట్ ఇప్పించారని, అధికారులు ఇప్పటికైనా కళ్ళు తెరవాలని సూచించింది.

ఈ సందర్భంగా ఆర్టీసీ ఇంచార్జ్ ఎండీ సునీల్ శర్మపై హైకోర్ట్ ఛీఫ్ జస్టిస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తన 15 ఏళ్ల జడ్జి చరిత్రలో ఇన్ని అబద్దాలు చెప్పే అధికారులను ఎక్కడా చూడలేదని, తాను మూడు రాష్ట్రాల్లో పనిచేశానని,  హైకోర్టుకు ఇలా ఎవరూ అబద్దాలు చెప్పలేదన్నారు. మంత్రిని ఉద్దేశ పూర్వకంగా తప్పు దోవ పట్టించినట్లు ఆర్టీసీ ఎండీ నివేదికలో స్వయంగా అంగీకరించడం ఆశ్చర్యంగా ఉందని కూడా హైకోర్టు వ్యాఖ్యానించింది. జీహెచ్ఎంసీ, ఆర్టీసీ, ఆర్థిక శాఖలు… ఒక్కొక్కరు ఒక్కో పాట పాడుతున్నారని హైకోర్టు వేలెత్తి చూపింది. ఒకదానితో ఒకటి సంబంధం లేకుండా చెబుతున్నారని, హైకోర్టుతో వ్యవహరించే తీరు ఇదేనా? అని అధికారులను హైకోర్టు నిలదీసింది. ప్రభుత్వం తీసుకున్న కఠిన నిర్ణయంవల్లే సమ్మె కొనసాగుతోందని,  దీనితో ప్రజలు 34 రోజులుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ​వేల కోట్లు వ్యయం చేసి అద్భుతమైన ప్రాజెక్ట్ లు కట్టే ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల కోసం రూ. 47 కోట్లు ఇవ్వడానికి నిరాకరించిందని, ​ప్రభుత్వం మానవతా దృక్పథంతో ఆలోచించాలని సూచించింది. ప్రజల కోసం ప్రభుత్వం తన స్టాండ్ మార్చుకోలేదా? ప్రభుత్వానికి సమస్యను పరిష్కరించే ఉద్దేశం ఉందా? లేదా? అని ప్రశ్నిస్తూ, ఆర్టీసీ సమ్మెపై తదుపరి విచారణను ఈ నెల 11వ తేదీకి వాయిదా వేసింది. మొత్తానికి టీఎస్ఆర్టీసీకి చట్టబద్ధతే లేదని వాదిస్తున్న కేంద్రంపై కేసీఆర్ ఎలా స్పందిస్తారో చూడాలి మరి.

Comments are closed.

Exit mobile version