కరోనా వ్యాక్సిన్ తొలిదశ పంపిణీకి కేంద్ర ప్రభుత్వం కార్యాచరణను సిద్ధం చేసినట్లు వార్తలు వస్తున్నాయి. దేశంలోని 23 శాతం మందికి తొలిదశలో కరోనా వ్యాక్సిన్ అందించేందుకు కార్యాచరణను సిద్ధం చేసినట్లు కేంద్రం ప్రకటించిందనేది ఆయా వార్తల సారాంశం.
మొదటి దశలో ఆరోగ్య కార్యకర్తలకు ప్రాధాన్యతనిస్తూ వ్యాక్సిన్ ఇవ్వనున్నట్లు సమాచారం. అంతేగాక కరోనా కట్టడిలో ఫ్రంట్ లైన్ వారియర్స్ గా వ్యవహరిస్తున్న పోలీసులకు, పారిశుధ్య కార్మికులకు కూడా తొలిదశలోనే వ్యాక్సిన్ ఇచ్చేందుకు ప్రణాళికను కేంద్రం సిద్ధం చేసింది.
అనారోగ్య సమస్యలు గల వారికి సైతం వ్యాక్సిన్ విషయంలో ప్రాధాన్యత ఇస్తారనేది తాజా సమాచారం. ప్రస్తుతం ముఖ్యమైన క్లినికల్ ట్రయల్ దశలో గల కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి రాగానే, ముందు ఎవరెవరికి ఇవ్వాలనే అంశంపై కేంద్రం కసరత్తు ప్రారంభించినట్లు ఓ జాతీయ మీడియా సంస్థ నివేదించింది.