కరీంనగర్ నుంచి గ్రానైట్ అక్రమంగా విదేశాలకు ఎగుమతి జరుగుతోందనే అంశంపై సీబీఐ రంగంలోకి దిగింది. ఈమేరకు విశాఖ సీబీఐ అధికారులు విచారణ ప్రారంభించారు. కరీంనగర్ గ్రానైట్ అక్రమ ఎగుమతులపై 2011 నుంచి కూడా విచారణ జరుగుతోంది. సీబీఐ, ఈడీ, కేంంద్ర సంస్థలు విచారణ జరుపుతున్న క్రమంలోనే గ్రానైట్ అక్రమ ఎగుమతి కొనసాగుతోందనే ఫిర్యాదుపై సీబీఐ రంగంలోకి దిగడం గమనార్హం.
కరీంనగర్ కు చెందిన బీజేపీ నాయకుడు, ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పేరాల శేఖర్ రావు ఇచ్చిన ఫిర్యాదుపై సీబీఐ విచారణ ప్రారంభించడం విశేషం. పన్ను ఎగవేత, మనీ లాండరింగ్, గ్రానైట్ అక్రమ ఎగుమతులపై విచారణ జరుగుతోంది.
కాకినాడ పోర్టు నుంచి కరీంనగర్ గ్రానైట్ అక్రమంగా విదేశాలకు ఎగుమతి అవుతున్నట్లు గుర్తించారు. ఇందుకు సంబంధించి అక్రమ ఎగుమతులకు పాల్పడుతున్న గ్రానైట్ కంపెనీలకు రూ. 750 కోట్ల జరినామా విధించారు. ఈమేరకు పలు గ్రానైట్ సంస్థలకు ఈడీ నోటీసులు కూడా జారీ చేసింది. అయినప్పటికీ గ్రానైట్ అక్రమ ఎగుమతి కొనసాగుతోందనే తాజా ఫిర్యాదుపై సీబీఐ విచారణ ప్రారంభించడం గమనార్హం.