బీజేపీ తెలంగాణా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తన ఖమ్మం పర్యటనలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ నే ప్రధానంగా ఎందుకు టార్గెట్ చేశారు? తరుముకొస్తున్న నగర పాలక సంస్థల ఎన్నికల సన్నాహక సమావేశాల్లో భాగంగా సంజయ్ రెండు రోజుల క్రితమే వరంగల్ మహా నగరంలో పర్యటించారు. తన పర్యటనలో భాగంగా శుక్రవారం ఖమ్మం నగర పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా స్థానిక బీజేపీ నేతలు పలు కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగానే ‘ఇంటలెక్చువల్ మీట్’ పేరుతో ఓ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశారు. వాస్తవానికి తన పర్యటనలో సంజయ్ పార్టీ విధానాలను, కేంద్ర ప్రభుత్వం నగరాల్లో చేస్తున్న అభివృద్ధి పనులను ఏకరవు పెడతారని అందరూ భావించారు. మహా అయితే ఎప్పటిలాగే సీఎం కేసీఆర్ ను టార్గెట్ చేసి తనదైన శైలిలో ఆరోపణలు, విమర్శలు గుప్పిస్తారని రాజకీయ పరిశీలకులు అంచనా వేశారు. కానీ ఇందుకు విరుద్ధంగా జరగడమే తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రెస్ మీట్ లో మంత్రి పువ్వాడ అజయ్ టార్గెట్ గా సంజయ్ పరుష పదాలను ఉపయోగించడం చర్చనీయాంశంగా మారింది.
ఖమ్మం నగర పర్యటనలో సంజయ్ స్థానిక మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ను టార్గెట్ చేసి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తడం గమనార్హం. ముఖ్యమంత్రి మెప్పు పొందడానికి, మంత్రి పదవిని కాపాడుకునేందుకే మాట్లాడితే ప్రజలు తిరగబడతారనే విషయాన్ని గుర్తుంచుకోవలసిన అవసరముందని సంజయ్ అన్నారు. ‘బిడ్డా నీ మంత్రి పదవి శాశ్వతం కాదు, నీ ముఖ్యమంత్రి శాశ్వతం కాదు, ఈ ప్రభుత్వం శాశ్వతం కాదు. రాబోయే ప్రభుత్వం భారతీయ జనతా పార్టీదేనని గుర్తుంచుకోవాలి. అహంకారంతో, గర్వంతో చెప్తలేం. మొట్టమొదటి సారిగా, బిడ్డా… ఫస్ట్ నీ సంగతే చెప్తం. సిద్ధాంతం గురించి మాట్లాడుతున్నడు. ఎర్ర జెండా పార్టీల చేరి, ఎర్ర జెండాకు మోసంజేసి, మళ్ల ఇంకో పార్టీ మార్చి, నాలుగు సంవత్సరాల్లో నాలుగు పార్టీలు మార్చిన నువ్వు జ్ఞానం గురించి మాట్లాడుతున్నవ్? ఎనభై వేల పుస్తకాలు చదివిన నీ ముఖ్యమంత్రిని అడుగు.. జ్ఞానం గురించి’ అని సంజయ్ వ్యాఖ్యానించారు. బీజేపీ దొంగల ముఠానట… మెడికల్ కాలేజీ పేరుతో రూ. 70 కోట్ల విలువైన మూడున్నర ఎకరాల ఎన్నెస్పీ కెనాల్ స్థలాన్ని రెగ్యులరైజేషన్ చేయించుకున్నారని సంజయ్ అన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా ఆయా భూమిని రెగ్యులరైజ్ చేయించుకోవడానికే టీఆర్ఎస్ లో చేరారని ఆయన ఆరోపించారు. ‘దోపిడీదొంగ, భూకబ్జాదారు’ అనే పరుష పదాలను ఉపయోగించి సంజయ్ వ్యాఖ్యలు చేశారు. ‘తీస్తం బిడ్డా… నీ ఎడ్యుకేషన్ ట్రస్ట్ సంగతేందో, నీ సంగతేందో పక్కా తీస్తం’ అని సంజయ్ అన్నారు. తెలంగాణా ప్రజలు కనుగొన్న ‘కరప్షన్ వ్యాక్సిన్ ను ఫస్ట్ ఖమ్మంలో మంత్రి మీదనే ప్రయోగిస్తం బిడ్డా, అది రియాక్షన్ కాకుండా చూసుకో ఫస్ట్’ అని సంజయ్ అన్నారు. ‘ముఖ్యమంత్రి గడీల వద్ద కాపలా కుక్క లెక్క కావలి కాస్తూ, ముఖ్యమంత్రి మోచేతి నీళ్లు తాగే నువ్వు బీజేపీని విమర్శిస్తావా? అసలు తెలంగాణా ఉద్యమంలో నువ్వెక్కడున్నవ్? అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నవ్. తెలంగాణాను వైసీపీ వ్యతిరేకించింది. అన్ని కాంట్రాక్టులు నీకే. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులకు సంబంధించిన కాంట్రాక్టులు కూడా నీకే. వేరే ఏ కాంట్రాక్టరును రానియ్యవ్. దోపిడీ దొంగలాగా దోచుకుంటున్నవ్ నువ్వు. అందుకే నీ భాష నీకే అప్పజెబుతున్న. నకిలీ మిర్చి విత్తనాల వల్ల రైతులు నష్టపోతే కంపెనీని రక్షించింది నువ్వు. రైతులకు రక్షణగా ఉండాల్సిందిపోయి, కంపెనీని రక్షించింది నువ్వు’ అంటూ సంజయ్ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ను టార్గెట్ చేస్తూ మాట్లాడారు. సంజయ్ తన మీడియా సమావేశంలో మాట్లాడిన సమయంలో దాదాపు 80 శాతం సమయాన్ని మంత్రి అజయ్ పైనే ఫోకస్ చేయడం గమనార్హం.
ఇంతకీ మంత్రిని బండి సంజయ్ ఎందుకు టార్గెట్ చేశారు? సంజయ్ తన పర్యటన లక్ష్యాన్ని జిల్లా మంత్రిపైకి మళ్లించడానికి దారి తీసిన పరిణామాలు ఏమిటి? ఓ సోషల్ మీడియా పోస్ట్ సంజయ్ ను తీవ్రంగా రెచ్చగొట్టిందా? అనే ప్రశ్నలకు ఔననే అంటున్నారు రాజకీయ పరిశీలకులు. సంజయ్ ఖమ్మం పర్యటనకు ఓ రోజు ముందుగా మంత్రి అధికారిక వాట్సాప్ గ్రూపులో చేసిన ఈ పోస్టును ఓసారి పరిశీలించండి. మంత్రికి చెందిన సోషల్ మీడియా వింగ్ కార్యకర్తల అత్యుత్సాహపు చర్య బండి సంజయ్ మంత్రి అజయ్ ను టార్గెట్ చేయడానికి ప్రేరేపించిందనే వ్యాఖ్యలు ఈ సందర్భంగా వినిపిస్తున్నాయి. ఈ సోషల్ మీడియా పోస్టే ఇందుకు ప్రధాన కారణంగా కావచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. విపక్ష నేతలు ఇటువంటి పర్యటనలకు వచ్చి, తమ ప్రసంగాల్లో ప్రభుత్వంపై, పాలక పార్టీ నేతలపై ఆరోపణలు, విమర్శలు చేస్తే, ఆ తర్వాత అధికార పార్టీ నేతలు సహజంగానే స్పందిస్తుంటారు. కానీ ఇందుకు విరుద్ధంగా సంజయ్ పర్యటనకు ముందే సోషల్ మీడియాలో వదిలిన ఓ పోస్ట్ మంత్రిని ఆయన టార్గెట్ చేయడానికి దోహదపడితే మాత్రం అంతకన్నా ‘రాజకీయ విషాదం’ మరొకటి లేదనే వాదనలూ ఈ సందర్భంగా వినిపిస్తున్నాయి. ఇంతకీ ఆ పోస్టులో ఏముందో దిగువన ఉన్నది ఉన్నట్లుగానే చదవండి.
ఇంటిలెక్చువల్ మీట్ ( మేధో సమావేశం) …
అసలు ఈ సమావేశం నిర్వహిస్తున్న మేధావులు ఎవరు..? వారికి ఉన్న మేధావితనం ఎంత..? ఇవన్ని ముందుగా తెలుసుకుందాం. నేను ఒక్కో ఉదాహరణ చెబుతా మీరు వాటిని యూ ట్యూబ్ లో సర్చ్ చేయండి ఖచ్చితంగా ఆ తాలుకు వీడియోలు దొరుకుతాయి..
ఈ మేతావులు కేవలం ఎన్నికల వేళల్లోనే వస్తారు.. నిజంగా మేధావి అయితే అతనికి ఒక సిధ్దాంతం .. ఒక అభివృధ్ది కాంక్ష.. ప్రజా సంక్షేమం మాత్రమే తెలుస్తాయి.. కాని వీరికి మాత్రం తరుచు అమాయకుల పై సంధించడం కోసం మతం , కులం … ఇది తప్పా వీళ్లు మరో మాట చెప్పగా విన్నారా ..?
చెట్టు, గాలి , నీరు , నేల , ఆకాశం ది ఏ మతం ..? ఏ కులం ..? ఈ మేతావులు వీటికి కూడా చరిత్ర వక్రీకరించి కుల , మతాలను ఆపాదించడానికి కూడా వెనకాడరు…
అభివృధ్ది తెలియని వాడు .. ఏమోషన్స్ ని సృష్టిస్తాడు. ప్రజా రక్షణ కోరని వాడు జాతుల విభజన చేస్తాడు. సంక్షేమం తెలియని వాడు మనుషుల మధ్య విష బీజాలు నాటుతాడు.. అసలు అభివృద్ధి తెలిసినవాడు “సర్వేజన సుఖీనోభవంతు” అని భావిస్తాడు. నేల పై ఉన్న ప్రతి ప్రాణిని ప్రేమిస్తాడు.. యావత్తు ప్రకృతిని ఆస్వాదిస్తాడు.. అంతే కాని పుట్టిన జాతిలో ప్రాణుల మధ్య ఖేదం సృష్టించడు. దైవ దూతల యుగంలో కూడా ఇతర జాతులు వున్నవి .. వాటి మనుగడకు ఎలాంటి అపాయం జరగలేదు. కాని నేడు ఏ దూత లేడు కాని ప్రాణ భద్రత, సంసృతుల భద్రత, చరిత్రల భద్రత , అసలు భిన్న జాతుల భద్రతే లేదు.. అనాగరిక సమాజంలో దళిత , సూద్రుల పై దాడులు జరిగినట్లు చరిత్రలో ఆధారాలు ఉన్నాయి.. నేటి నాగరిక సమాజంలో మత విద్వేషాలు రెచ్చగొడుతూ పాలిస్తున్న ప్రదేశాల్లో దళితులు , సూద్రులు , మైనారిటీల ప్రాణాలకు , మానాలకు ఆవగింజంతైన భద్రత ఉందా.. ఏ మాత్రం భద్రత ఇవ్వాలేని చెట్టు కొమ్మలు నేడు మేధో సమావేశం నిర్వహిస్తామని వస్తున్నారు..
ఈ మేధావులు..
ముందుగా బాబ్రీ మసీదు కూల్చివేత వివరణ ఇవ్వాలి.
గోద్ర హత్యలపై వివరణ ఇవ్వాలి ..
….
….
….
….
….
ప్రతి దేశ పౌరుడికి ఇస్తామన్న 15 లక్షల పై వివరణ ఇవ్వాలి..
దళితులను చంపుతున్న వైఖరి పై వివరణ ఇవ్వాలి..
ఆవు మాంసం ఎగుమతి చేస్తున్న సంస్థలు ఆ పార్టీ వారివే ఉండి .. ఆవు మాంసం పేరుతో హత్యలు చేస్తున్న వైఖరి పై వివరణ ఇవ్వాలి..
ముస్లిం అల్లుళ్లను కలిగిన సదరు నాయకులు మత మార్పిడి చట్టాలను రూపొందిస్తున్న వైఖరి పై వివరణ ఇవ్వాలి ..
మహిళల పై జరుగుతున్న అత్యచారాలపై వివరణ ఇవ్వాలి ..
నల్లధనం తీసుకరాకపోవడం పై వివరణ ఇవ్వాలి ..
2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని ఇవ్వక పోవడం పై వివరణ ఇవ్వాలి ..
రామాలయ శంకుస్థాపన కు రాష్ట్రపతిని పిలవకపోవడం పై వివరణ ఇవ్వాలి ..
చివరికి రాష్ట్రం లో అధికారం లేకున్న కాని మునిసిపాలిటీలలో అధికారంలోకి వచ్చేందుకు తప్పుడు వాగ్దానాలు చేస్తున్నాదాని గురించి వివరణ ఇవ్వాలి ..
జ్ఞానం , శీలం , ఏకతకు బదులు .. అజ్ఞానం , అశ్లీలత , అనైక్యతను విస్తరింపచేస్తున్నందుకు వివరణ ఇవ్వాలి ..!!
అంతే కాని జ్ఞానం లేని వారు … మేధో సమావేశం నిర్వహించడం సిగ్గు చేటు దీని గురించి యావత్తు సమాజం పునరాలోచించాలి..!!!
ఇలాంటి దొంగల ముఠాలను తరిమి కొట్టాలి. పచ్చని తోరణంలాంటి ఖమ్మం కాషాయ పురుగులను తరిమికొట్టాలి…!!!
జై తెలంగాణ ..✊✊