ఆఫర్ అంటే ఇలా కూడా ఉండాలి. బంపర్ ఆఫర్… డబుల్ ధమాకా… బొనాంజా వంటి వ్యాపార ప్రకటనలు వదిలేయండి. సాధారణంగా పండుగలు, పర్వదినాల్లో బట్టల షాపులు, షాపింగ్ మాల్స్ నిర్వాహకులు కొనుగోలుదార్లను ఆకర్షించడానికి రకరకాల ఆఫర్లు ఇస్తుంటాయి కదా? ఒకటి కొంటే మరొకటి ఫ్రీ అని, రెండు కొంటే ఒకటి ఉచితమని, గిఫ్ట్ ఓచర్లంటూ రకరకాల ప్రచారంతో ఆయా వ్యాపార సంస్థలు ఊదరగొడుతుంటాయి. అవసరమైతే షాపుల ముందు కార్ల వంటి ఖరీదైన బహుమతులను కూడా ప్రదర్శనగా ఉంచుతాయి. లక్కీ డ్రాలో గెలుపొందే అవకాశం మీదే కావచ్చని వ్యాపారులు కొనుగోలుదార్లకు ఆశ పెడుతుంటారు. ఆకర్షిస్తుంటారు.
ఆఫ్టరాల్ బట్టల షాపులు, భారీ షాపింగ్ మాల్స్ మాత్రమే ఇటువంటి ఆఫర్లు ఇవ్వగలవా? మాంచి కిక్కిచ్చే ఆఫర్లను మేం మాత్రం ప్రకటించలేమా? అనుకున్నట్లున్నారు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఓ వైన్ షాపు నిర్వాహకులు. న్యూ ఇయర్, సంక్రాంతి పండుగ నేపథ్యంలో ఓ లక్కీ డ్రానే ప్రకటించారు. తమ వైన్ షాపులో ‘మందు’ కొంటే వివిధ రకాల బహుమతులను గెల్చుకునే అవకాశం ఉందంటూ జయశ్రీ వైన్స్ షాపు నిర్వాహకులు ప్రకటించారు. రూ. 2,000 లేదా అంతకు మించి విలువైన లిక్కర్ కొనుగోళ్లపై కూపన్లు ఇస్తున్నారు. ఫస్ట్ ప్రైజ్ గా ఎల్సీడీ టీవీ, సెకండ్ ప్రైజ్ గా స్మార్ట్ ఫోన్, థర్డ్ ప్రైజ్ కింద సిల్వర్ కాయిన్స్, ఇతర బహుమతులుగా మందు తాగే గ్లాస్ సెట్లను ఇవ్వనున్నట్లు ప్రకటించారు.
లిక్కర్ షాపు వద్ద ఈ లక్కు గోలేంటి? అని సందేహపడకండి. ఈ మధ్య తెలంగాణా ప్రభుత్వం మద్యం ధరలను పెంచింది కదా? సేల్స్ పడిపోయాయట. అందువల్లే తాగుబోతులను ఆకర్షించడానికి వైన్ షాప్ నిర్వాహకులు ఈ బహుమతులను ప్రవేశపెట్టారట. అన్నట్లు ఈ ఆఫర్ కు ఆకర్షితులైన మందుబాబులు లిక్కర్ కొనుగోళ్ల కోసం ‘బార్లు’ తీరి మరీ కొంటున్నారట. అదీ సంగతి.