తెలంగాణాలో అధికార పత్రిక ‘నమస్తే తెలంగాణా’ తన విలేకరులకు బంపర్ ఆఫర్ ఇచ్చింది. అయితే ఈ అద్భుత ఆఫర్ సంగతి యాజమాన్యానికి తెలుసో… లేదోగాని, అందులో పనిచేసే పాత్రికేయులను ఉద్దేశించి సాక్షాత్తూ పత్రిక ఎడిటరే స్వయంగా ఈ ఆఫర్ ఇచ్చినట్లు ప్రాచుర్యంలోకి వచ్చింది. జిల్లాల బ్యూరో ఇంచార్జిలు మండల స్థాయి విలేకరులకు కొద్దిసేపటి క్రితమే దీన్ని పంపడం విశేషం. ఈమేరకు నమస్తే తెలంగాణాలో పనిచేసే విలేకరుల, సిబ్బంది వాట్సాప్ గ్రూపుల్లో ఈ బంపర్ ఆఫర్ మెసేజ్ చక్కర్లు కొడుతోంది.
బహుషా తెలుగు మీడియా చరిత్రలో, అందునా కరోనా కల్లోల పరిస్థితుల్లో ఇటువంటి ‘బంపర్’ ఆఫర్ ను అందుకోవడానికి మిగతా పత్రికల విలేకరులు ఫోన్లు కూడా చేస్తున్నారట. మీరు మరొకరికి అవకాశాన్ని ఇవ్వరనే అనుకుంటున్నానని, మీ స్థానంలో ఇంకొకరు వచ్చే పరిస్థితులకు తావు ఇవ్వొద్దని కూడా ఈ ఆఫర్ చివరన హితవు చెప్పడం కూడా మరో విశేషం.
ఇంతకీ ఏమిటా బంపర్ ఆఫర్? దాని వివరాలేమిటి అంటే…? అందుకు సంబంధించిన పోస్టును ఉన్నది ఉన్నట్లుగా దిగువన మీరే చదవండి. ఆ తర్వాత ఇది ‘బంపర్ ఆఫర్’ అవునో… కాదో మీరే నిర్ణయించండి.
Msg from editor garu ..
————————-
మీ సంపాదన నెలకు 45 వేలు
————————
అవును. మీరు చదివింది నిజమే. నెలకు 30 వేల నుంచి 45 వేల వరకు సంపాదించుకోగలరు. దానికి మీరు చేయాల్సిందంతా కొంత మనసు పెట్టడం. మీ శక్తి యుక్తులను కేటాయించడం. ఎలాగ? చదవండి.
1) అడ్వర్టైజ్మెంట్
ఇన్నాళ్లు మీరు ఏడాదికోసారో.. ఎన్నికలప్పుడో యాడ్ లు తెచ్చేవారు. కానీ ఇక సంవత్సరం పొడవునా మీరే అడ్వర్జైజ్మెంట్ తెచ్చుకునేలా నెల రోజుల క్రితమే మన సంస్థ మీకు చక్కటి అవకాశం ఇచ్చింది. ప్రతి యాడ్ పైన 15 శాతం కమిషన్ ప్రకటించింది. ఉదాహరణకు నెల రోజుల్లో మీరు చిన్నా పెద్దా యాడ్ కలిపి ఓ లక్ష వరకు యాడ్ చేశారనుకోండి.
మీ అకౌంట్లో 15 వేల రూపాయలు వచ్చినట్టే కదా.
పెద్ద యాడ్లే చేయాలా?
యాడ్ అనగానే మీరు రాజకీయ నాయకుల వైపు చూస్తున్నారు. లేదా బిల్డర్లవైపు చూస్తున్నారు. కానీ ఆ దృక్పథం మార్చుకోండి. చిన్న వాళ్లు కూడా యాడ్ ఇచ్చేవాళ్లు ఉంటారు. వాళ్లకు దారి తెలియక ఆగిపోతారంతే. ఒకసారి వాళ్ల యాడ్ వేసి..చిన్న వార్త రాసి చూడండి. జస్ట్ కనెక్టవండి. సంవత్సరానికో యాడ్ ఇవ్వాలని రిక్వెస్ట్ చేయండి. పెద్ద యాడ్లే చేయాల్సిన అవసరం లేదు. 5 వేల రూపాయల నుంచి మొదలుకొని మీకు అనేక రకాల టారిఫ్లు ఉన్నాయి. మీకున్న పరిచయాలను వినియోగించుకోండి. పుట్టిన రోజులు, వర్ధంతులు, విదేశీ ఆగమనాలు, విదేశాల నుంచి రాకలు, పరీక్షల్లో ర్యాంకులు, పదవీ విరమణలు, ఆస్పత్రులు, కాలేజీలు, స్కూళ్లు, కిరాణా కొట్లు, బార్బర్ షాపులు..వీళ్లంతా మీకు యాడ్ ఇవ్వదగిన కస్టమర్లే.
2) సర్క్యులేషన్
సంవత్సర చందా కట్టించే ప్రతి కాపీపై సంస్థ మీకు 300 రూపాయలు కమిషన్ ఇస్తున్నది. మీరు రోజుకు 3 కాపీలు లక్ష్యంగా విధించుకోండి. నెలకు 100 కాపీలు చేయించండి. నెలాఖరు నాటికి 30,000 రూపాయలు మీ అకౌంట్లో పడతాయి కదా. సర్క్యులేషన్ కాపీ అనగానే మళ్లీ మీరు నాయకుల వైపు చూడడం మానుకోండి. మీరు మీ వార్తల్లో రాసే ప్రతి పేరు మీకు కాపీ చేయించదగ్గ కస్టమరే.
———————-
వార్తలు బాగా రాయగలిగిన వారే యాడ్స్ , సర్క్యులేషన్ చేయిస్తారు. అందరు విలేకరులకు కరోనా కష్టకాలంలా దాపురిస్తే.. కేవలం మీకు మాత్రమే ఓ కొత్త సువర్ణ అవకాశాన్ని కలిగించింది. వార్తలు రాస్తూనే నెలకు మీరు 45 వేల రూపాయలు సంపాదించుకునే చాన్సిచ్చింది. అవకాశాన్ని అందిపుచ్చుకోండి. స్థిరమైన సంపాదన దిశగా మిమ్మల్ని మీరు మార్చుకోండి.
(ఈ ఆఫర్ ను మేమూ చేస్తామని బాగా వార్తలు రాస్తామని మిగతా పత్రికల విలేకరులు మనకు ఫోన్లు చేస్తున్నారు. మీరు మరొకరికి అవకాశాన్ని ఇవ్వరనే అనుకుంటున్నాను. మీ స్థానంలో ఇంకొకరు వచ్చే పరిస్థితులకు తావు ఇవ్వొద్దు. జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి. సంపాదించండి. మీరు మీ కుటుంబం ఆనందంగా ఉండండి)