ఫార్ములా ఈ-రేస్ కారు కేసు వ్యవహారంలో రూ. 55 కోట్లు విదేశీ సంస్థకు చెల్లించిన మాట వాస్తవమేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంగీకరించారు. ఈ అంశంలో ఐఏఎస్ అధికారి అర్వింద్ కుమార్ తప్పేమీ లేదని, ఇందుకు పూర్తి బాధ్యత తనదేనని కూడా కేటీఆర్ స్పష్టం చేశారు. ఫార్ములా ఈ – రేస్ కారు కేసు వ్యవహారంలో ఒప్పందం కుదరడానికి ముందే నిధులు చెల్లించారని, అందులోనూ విదేశీ కరెన్సీ రూపంలో చెల్లించారనే అభియోగంపై విచారణను ప్రభుత్వం వేగవంతం చేసినట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ నేత కేటీఆర్ గురువారం హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడారు.
ఫార్ములా ఈ-రేస్ కారు కేసుకు సంబంధించి భిన్న కథనాలు వస్తున్న పరిణామాల్లో కేటీఆర్ మాట్లాడుతూ, ఉచ్చు బిగుస్తోందని కొందరు ఏదేదో రాస్తున్నారని, ఉచ్చు లేదు.. బొచ్చు లేదు, తాను ఇందులో చేసిన తప్పేమీ లేదని వ్యాఖ్యానించారు. హెచ్ ఎండీఏ వైస్ చైర్మెన్ గా తనకు గల అధికారాల మేరకు తానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. తెలంగాణా, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచడానికి తానే నిధులు చెల్లించేందుకు ఐఏఎస్ అధికారి అర్వింద్ కుమార్ కు మౌఖిక ఆదేశాలు జారీ చేశానని కేటీఆర్ అంగీకరించారు.
తనపై కేసు నమోదుకు గవర్నర్ అనుమతిస్తే, కేసు నమోదు చేసి తనను అరెస్ట్ చేస్తే, రెండు, మూడు నెలలు జైల్లో ఉండి యోగా చేస్తూ స్లిమ్ముగా తయారవుతానని చెప్పారు. ఆ తర్వాత పాదయాత్ర చేస్తానని వెల్లడించారు. తనను అరెస్టు చేసినా భయపడేది లేదని, రేవంత్ రెడ్డి విధానాలపై పోటారం చేస్తూనే ఉంటానని కేటీఆర్ పేర్కొన్నారు. మొత్తంగా విదేశీ కంపెనీలకు 55 కోట్లు చెల్లించిన అంశంలో విషయాన్ని కేటీఆరే స్వయంగా అంగీకరించిన నేపథ్యంలో తర్వాత జరిగే పరిణామాలు ఎలా ఉంటాయనేది వేచి చూడాల్సందే.