బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల నియోజకవర్గం తెలుసు కదా? కేటీఆర్ పొలిటికల్ కోటగా ప్రాచుర్యం పొందిన రాజన్న సిరిసిల్ల జిల్లాలో సరికొత్త ‘నిజాయితీ’ తెరపైకి వస్తోంది. తమ పేరున గల ప్రభుత్వ భూములను మాజీ ప్రజాప్రతినిధులు కొందరు స్వచ్ఛందంగా సర్కారుకు తిరిగి అప్పగిస్తున్నారు. సర్కారు జాగా కనిపిస్తే చాలు కబ్జాకు పాల్పడే ఈ రోజుల్లో ఇంత నిజాయితీగా ప్రభుత్వ భూములను తిరిగి ఇవ్వడం ఖచ్చితంగా సంచలన వార్తే కదా? ఇక అసలు విషయంలోకి వెడితే..
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ భూములు, ప్రభుత్వేతర భూములు భారీ ఎత్తున కబ్జాకు గురైనట్లు అనేక వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. సర్కారు అండతో అనేక మంది గులాబీ లీడర్లు చేసిన అరాచకం ఇప్పటికీ ప్రజల మస్తష్కం నుంచి తొలగలేదనే వ్యాఖ్యలున్నాయి.ఈ నేపథ్యంలోనే కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల నియోజకవర్గంలో భూ కబ్జాల సంగతి ఎలా ఉన్నప్పటికీ, పింక్ పార్టీకి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు సర్కారు జాగాలను కాజేశారనే ప్రచారం ఉండనే ఉంది. పైగా పట్టాదార్ పాస్ పుస్తకాలు కూడా సంపాదించి, కేసీఆర్ సార్ రైతు సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన రైతు బంధు పథకం ద్వారా ఇటువంటి భూములకు కారు పార్టీ లీడర్లు లబ్ధి కూడా పొందారు.
అయితే అప్పట్లో.. అంటే కేసీఆర్ సార్ జమానాలో, కేటీఆర్ ఇలాఖాలో ఇలా సర్కారు భూములను చేజిక్కించుకున్నవారు ఇప్పుడు తెగ భయపడిపోతున్నారు. వామ్మో ఈ సర్కారు భూములు మాకొద్దు.. అంటూ కలెక్టర్ ను కలిసి మరీ అప్పగిస్తున్నారు. నమ్మడం లేదా?
ఫొటోలో సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎస్పీ అఖిల్ మహాజన్ లతో కనిపిస్తున్న మహిళ పేరు మిట్టపల్లి పద్మ. తంగళ్లలపల్లి మండలం లక్ష్మీపురం గ్రామ సర్పంచ్ గా కూడా పనిచేశారు. తాను నిరుపేదనని, తన ఉపాధికోసం ఏదైనా సర్కారు భూమి ఇవ్వాలని 2018లో బీఆర్ఎస్ ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారు. దీంతో తాడూరు గ్రామ శివారులోని సర్వే నెం. 545/1/1/3/1 ద్వారా రెండెకరాల భూమిని ప్రభుత్వం ఉదారంగా కేటాయించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు లక్ష రూపాయలను రైతు బంధు ద్వారా లబ్ధిని కూడా పద్మ పొందారు.
కానీ ఉన్నట్టుండి ఈ భూమి తనకు వద్దని జిల్లా కలెక్టర్, ఎస్పీల సమక్షంలో పట్టాదార్ పాస్ బుక్కును అప్పగించారు. ఇంతకీ మాజీ సర్పంచ్ పద్మ తన రెండెకరాల భూమిని స్వచ్ఛందంగా అప్పగించడానికి కారణమేంటో తెలుసా? కారు పార్టీ కాలంలో ప్రభుత్వ భూములను ఇలా చెర పట్టిన వారిని పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపిస్తున్నారు. ఇప్పటికే అనేక మంది ఇటువంటి దందాలో జైలుకు వెళ్లారు. ఇప్పటివరకు పోలీసులు అరెస్టు చేసినవారిలో ఎక్కువ మంది కేటీఆర్ అనుచరులే ఉన్నట్లు సమాచారం.
ఈ పరిణామాల్లోనే మాజీ సర్పంచ్ మిట్టపల్లి పద్మ భయాందోళనకు గురై, తనను కూడా జైలుకు పంపిస్తారనే ఆందోళనతో రెండెకరాల భూమిని జిల్లా కలెక్టర్ కు అప్పగించారు. కొన్ని వందల ఎకరాల ప్రభుత్వ భూమి కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల నియోజకవర్గంలో అప్పట్లో ఇలాగే అన్యాక్రాంతమైందట. ఈ అంశంలో కాంగ్రెస్ ప్రభుత్వం కన్నెర్రజేస్తుండడంతో భీతిల్లిన బీఆర్ఎస్ లీడర్లు తమదైన శైలిలో ఈ తరహా నిజాయితీని ప్రకటిస్తున్నార. ఇందులో భాగంగానే ప్రభుత్వ భూములును అధికారులకు అప్పగిస్తున్నారట. అదీ అసలు విషయం.