రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమృత్ టెండర్ల అంశంలో పొంగులేటి సవాల్ ను తాను స్వీకరిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆదివారం ఆయన హైదరాబాద్ తెలంగాణా భవన్ లో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర తదితర నాయకులతో కలిసి మీడియాతో మాట్లాడారు. ‘మంత్రి గారు కాదు.. ముఖ్యమంత్రే రాజీనామా జేయాలె తొందర్లోనే.. నువ్వేం టెన్షన్ పడకు’ అని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ‘నాకు తెలిసీ..పొంగులేటిగారు సీఎంను ఫిక్స్ చేసేందుకు ఫిక్స్ అయినట్లున్నరు. ఎందుకంటే ఈ ప్రభుత్వానికి చట్టాలు తెలిసినట్లు లేవు, చుట్టరికాలు కూడా తెలిసినట్లు లేవు. పొంగులేటిగారు ఆగమేఘాల మీదొచ్చి ప్రెస్ మీట్ పెడితే నాకర్ధమైందేమిటంటే..అర్జంటుగా ముఖ్యమంత్రిగారిని పదవినుంచి ఊడపీకాలనే ఎజెండా మంత్రిగారికి ఉన్నట్టున్నది..’ అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
తమకు అన్నీ తెలుసని, ఏం జరుగుతున్నదో తెలుసన్నారు. పదేళ్లు ప్రభుత్వాన్ని నడిపామని, అందులో తమకు కూడా అభిమానులు ఉంటారని, విజిల్ బ్లోయర్స్ ఉన్నట్లు చెప్పారు. అమృత్ టెండర్లలో తప్పు జరగలేదని నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని మంత్రి పొంగులేటికి కేటీఆర్ సవాల్ విసిరారు. నిన్న ఒక మంత్రి తప్పు జరిగిందని నిరూపిస్తే రాజీనామా చేస్తానని బిల్డప్ ఇచ్చారని, ఆయనకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఇద్దరం కలిసి హైకోర్టు సీజే దగ్గరకి పోదామని, వెంటనే సిట్టింగ్ జడ్జితోని ఎంక్వయిరీ చేయిద్దామన్నారు. సిట్టింగ్ జడ్జి గనుక ఇందులో తప్పులేం జరగలేదంటే, తాను రాజకీయ సన్యాసం చేస్తానన్నారు. హైకోర్టు సీజే దగ్గరికి రావడానికి మంత్రి పొంగులేటికి ఇబ్బంది ఉండే, డేట్, టైం ఫిక్స్ చేయాలని, ఇద్దరం కలిసి కేంద్రంలో ఉండే సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ దగ్గరికి పోదామన్నారు. మంత్రికి, ముఖ్యమంత్రికి ఒకటే చెప్తున్నానని ఇప్పటికైనా టెండర్లు రద్దు చేయాలన్నారు.