రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పొలిటికల్ ‘బాంబు’ల ప్రకటనకు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గురువారం చేసిన తాజా వ్యాఖ్యలకు ఏదేని ‘పొంతన’ కుదురుతోందా? తెలంగాణా రాజకీయాల్లో తాజా హాట్ టాపిక్ ఇది. ముఖ్యంగా నిన్నటి పొంగులేటి ‘బాంబు’ల ప్రకటన అనంతరం జరిగిన ఓ కార్యక్రమంలో మాజీ మంత్రి కేటీఆర్ తాజాగా చేసిన సంచలన వ్యాఖ్యలు ఏదేని పొంతనకు సంకేతంగా భావించవచ్చా? అనేది రాజకీయ పరిశీలకుల సంశయం.
దక్షిణ కొరియా రాజధాని సియోల్ లో నిన్న పొంగులేటి మీడియాతో ఏమన్నారంటే.. దీపావళి పండగకు ముందే తెలంగాణాలో పొలిటికల్ బాంబులు పేలనున్నట్లు ప్రకటించారు. తెలంగాణాలోని ప్రధాన నాయకులపై చర్యలు ఉంటాయనే ఇండికేషన్ ఇచ్చారు. ముఖ్యంగా ధరణి, కాళేశ్వరం, ఫోన్ ట్యాపింగ్ తదితర అంశాలను మంత్రి పొంగులేటి ప్రస్తావించారు.
సియోల్ నుంచి హైదరాబాద్ కు వెళ్లాకగాని, లేక హైదరాబాద్ చేరుకున్న మరుసటిరోజో ఒకటో, రెండో బాంబులు తప్పకుండా పేలునున్నాయని చెప్పారు. దీంట్లో ప్రధాన నాయకులే ఉంటారన్నారు. బహుషా హైదరాబాద్ లో ప్లయిట్ దిగేసరికే ప్రజలు కోరుకున్న చర్యల సమాచారం మీడియా ద్వారా వెల్లడవుతుందని చెప్పారు.
దక్షిణ కొరియా పర్యటనకు వెళ్లిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శ్రీనివాసరెడ్డి టీం శుక్రవారం ఉదయ 10.30 గంటలకు హైదరాబాద్ చేరుకుంటుంది. విశ్వసనీయ సమచారం ప్రకారం వీలైతే జపాన్ కూడా వెళ్లాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తలంచారు. కానీ జపాన్ వెళ్లకుండానే షెడ్యూల్ ప్రకారం మరికొద్ది గంటల్లోనే.. శుక్రవారం ఉదయం మంత్రి హైదరాబాద్ చేరుకుంటున్నారు.
ఈ నేపథ్యంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సియోల్ లో చేసిన ప్రకటన ప్రకారం ధరణి, ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం తదితర అంశాల ఆరోపణల్లో ఎవరేని ముఖ్య నాయకునిపై ప్రభుత్వం చర్య తీసుకుంటుందా? అనే ప్రశ్నపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రకరకాల వాదనలతో ఈ చర్చలు భిన్న వర్గాల మధ్య జోరుగా సాగుతున్నాయి.
కేటీఆర్ తాజా వ్యాఖ్యలు యాధృచ్చికమే కావచ్చు.. కానీ పొంగులేటి సియోల్ లో చేసిన పొలిటికల్ బాంబుల ప్రకటన అనంతరం జరిగిన కార్యక్రమంలో కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేయడమే తీవ్ర చర్చకు దారి తీసింది. ఈమేరకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదిలాబాద్ లో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదిలాబాద్ లో గురువారం నిర్వహించిన ‘రైతు పోరుబాట’ కార్యక్రమంలో కేటీఆర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజల, రైతుల కోసం తాను జైలుకు వెళ్లడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. తాను జైలుకు వెళ్లడానికి సిద్ధంగా ఉన్నానని, ప్రజల, రైతుల కోసం ఒకటీ, రెండేళ్లపాటు జైల్లో ఉండేందుకు సిద్ధమని, ఎవని అయ్యకూ భయపడేది లేదని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. అంతేకాదు కాంగ్రెస్ పార్టీ నాయకులను ప్రజలు ఉరికించి కొట్టే రోజులు దగ్గర పడ్డాయని హెచ్చరించారు.
పార్టీ తరపున అనేక పోరాట కార్యక్రమాల్లో పాల్గొంటున్న కేటీఆర్ అకస్మాత్తుగా జైలు ప్రస్తావన ఎందుకు తీసుకువచ్చారు? ఇది కాకతాళీయమేనా? లేక అన్యాపదేశంగా, ఆవేశపూరితంగా జైలు వ్యాఖ్యలు చేశారా? లేక ఏదేని అంశంలో ఆయనకు ముందస్తు సమాచారమేదైనా ఉండడం వల్లే ఈ వ్యాఖ్యలు చేశారా? అనే ప్రశ్నలపై రాజకీయ వర్గాల్లో భిన్న చర్చ జరుగుతోంది. మంత్రి పొంగులేటి ప్రకటనకు, బీఆర్ఎస్ నేత కేటీఆర్ జైలు వ్యాఖ్యలకు ఏదేని పొంతన కుదురుతున్నట్టేనా? అనే ప్రశ్నపై రాజకీయ పరిశీలకుల్లో తీవ్ర చర్చ జరుగుతోంది.