జర్నలిస్టు అంటే ఎలా ఉండాలి? ప్రెస్ మీట్లకు వెళ్లినపుడు ఎలా వ్యవహరించాలి? వెళ్లామా? రాజకీయ నాయకులు చెప్పింది విన్నామా? రాసుకున్నామా? వాళ్లు పెట్టిందేదో తిన్నామా? భజన చేశామా? జయహో అంటూ కీర్తిస్తూ వార్త రాశామా? ఇంటికెళ్లామా? నిద్రావస్థలోకి జారుకున్నామా? లేదా? ఇదీ అసలు సిసలు జర్నలిస్టు వ్యవహరించాల్సిన పద్ధతి.
ఇదీ సంతృప్తికరంగా లేకపోతే అధికారంలో గల నాయకులకు వంధి మాగదుల్లా వ్యవహరించాలి. వీలైతే సలహాదారులుగా మారాలి. లేదంటే పీఆర్వో డ్యూటీ చేయాలి. ఇందుకు ప్రతిఫలంగా సంస్థలు చెల్లించే వేతనాలను మించి నెలవారీ మొత్తాలను పరోక్ష వేతనాలుగా అధికార పార్టీ నేతల నుంచి ముడుపులుగా స్వీకరించాలి. నాయకుడి మీద ఈగ వాలితే సహించకూడదు. వ్యతిరేక వార్త రాసిన విలేకరిపై చాడీలు చెప్పి పబ్బం గడుపుకోవాలి. ఆ విలేకరిపై సంస్థకు ఎలా ఫిర్యాదు చేయాలో, ఉద్యోగాన్ని ఎలా పీకించాలో నాయకుడికి మనమే నేర్పాలి.
అయినప్పటికీ ఉద్యోగ సంతృప్తి (జాబ్ సాటిస్ఫ్యాక్షన్) కలగకపోతే మరో ఇద్దరు, ముగ్గురు ప్రముఖ సంస్థల్లో పనిచేసే సహచర జర్నలిస్టులను పిల్లల కోడిలా వెంటేసుకుని తిరుగుతూ, ఎమ్మెల్యే పేరునో, మంత్రి పేరునో వాడుకుని ఎడాపెడా సెటిల్మెంట్లు చేసుకోవాలి. దందాలకు పాల్పడాలి. నాయకుడితో సాన్నిహిత్యం ఉన్నట్లు సెల్ఫీలు దిగాలి. చెట్టుపేరు చెప్పుకుని కాయలు అమ్ముకోవాలి. అవసరమైతే కొందరు ప్రభుత్వ అధికారులను ఈ దందాలో భాగస్వామ్యం చేసుకోవాలి. తరాలకు తరాలు కూర్చుని తిన్నా తరగని సంపదను పోగేసుకోవాలి. ఇదీ నయా జర్నలిజపు పోకడ అంటే.
కానీ… బ్రెజిల్ దేశంలో జర్నలిస్టులకు ఇవేవీ వంటబట్టినట్లు లేదు. అందుకే కాబోలు దేశాధ్యక్షునిచేత ముష్టి ఘాతాలు కురిపించుకునే స్థాయికి దిగజారి మరీ ప్రశ్నించడమేంటి? ఔను పాలకులన్నాక ఆరోపణలు వస్తుంటాయి. కుంభకోణాల్లో పాత్రలూ ఉంటుంటాయి. ఆ నాయకుడి పుత్రరత్నంపైన, ఆయన సతీమణి, దేశ ప్రథమ పౌరురాలిపైనా ఉద్యోగుల వేతనాల్లోనే కుంభకోణానికి పాల్పడ్డారంటూ పత్రికలు వార్తా కథనాలు రాస్తుంటాయి. ఇందుకు సంబంధించి ప్రభుత్వ పరంగా విచారణ కూడా జరుగుతుంటుంది.
అంత మాత్రాన జర్నలిస్టులు ఓ దేశాధ్యక్షుడిని పట్టుకుని ప్రశ్నిస్తారా? తమరి సతీమణిపై వస్తున్న ఆరోపణల సంగతేమిటిని పది మంది ముందు నిలదీస్తారా? అందుకే బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సోనారోకు చిర్రెత్తుకొచ్చింది. అంతే సహనం కోల్పోయిన ఆయన ‘నిన్ను చితక బాదేస్తా… నీ ముఖంపై పిడి గుద్దులు కురిపించాలని ఉంది’ అని హుంకరించారుట. మరో ప్రశ్నకు అవకాశం కూడా ఇవ్వకుండా బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సొనారో అక్కడి నుంచి నిష్క్రమించినట్లు జాతీయ వార్తా సంస్థల కథనం.
ఇంతకీ ఆ జర్నలిస్టుపై బ్రెజిల్ అధ్యక్షుని కోపానికి కారణమేంటో తెలుసా? బ్రెజిల్ అధ్యక్షుని సుపుత్రుడు ఫ్లేవియా బోల్సొనారో రియో డి జనిరోలో 2011-2016 మధ్య ఎమ్మెల్యేగా పనిచేశాడు. అప్పట్లో ఉద్యోగుల వేతనాల కుంభకోణం జరిగిందట. ఈ బాగోతంలో దేశాధ్యక్షుడి సతీమణి, ప్రథమ పౌరురాలు మిఛెల్లీ బొల్సొనారో ఖాతాలకు నిధులు మళ్లాయట.
పత్రికల్లో వచ్చిన వార్తలు ప్రామాణికంగా ప్రభుత్వ పరంగా విచారణ కూడా జరుగుతోంది. ఇదే విషయంపై చర్చికి హాజరైన బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సొనారోను ఓ జర్నలిస్టు ప్రశ్నించారు. ‘మీ సతీమణిపై వస్తున్న అవినీతి ఆరోపణల సంగతేమిటి?’ అని పదే పదే ప్రశ్నించారు. ఇందుకు సమాధానం చెప్పలేని బ్రెజిల్ ప్రెసిడెంట్ విలేకరిని పట్టుకుని పిడిగుద్దులు కురిపిస్తానంటూ హుంకరించాడు. మీడియా మేనేజ్మెంటులో బ్రెజిల్ అటు అధ్యక్షునికి, భజన చేయడంలో ఇటు సదరు జర్నలిస్టుకు బొత్తిగా అనుభవం లేనట్టుంది కదూ!