బ్లాక్ ఫంగస్… మ్యుకర్ మైకోసిస్ గానూ పిలిచే ఈ వ్యాధి దేశవ్యాప్తంగా కరోనా రోగులను, కరోనాన జయించిన బాధితులను భయకంపితులను చేస్తున్న సంగతి తెలిసిందే. మహారాష్ట్రలో బ్లాక్ ఫంగస్ కారణంగా ఇప్పటికే 52 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 1,500 మంది వరకు ఆసుపత్రుల్లో చికిత్స తీసుకుంటున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే తెలంగాణాలోనూ బ్లాక్ ఫంగస్ ఆనవాళ్లు కనిపించినట్లు కొన్ని ఘటనలను బట్టి తెలుస్తోంది. నిర్మల్ జిల్లా భైంసా ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి బ్లాక్ ఫంగస్ కారణంగా మరణించినట్లు నిన్నటి వార్తల సారాంశం. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడకు చెందిన మరో ఇద్దరు కూడా బ్లాక్ ఫంగస్ వల్ల ప్రాణాలు కోల్పోయిట్లు తాజా ప్రచారం.
ఈ పరిణామాల్లోనే ఖమ్మం జిల్లాలో కూడా బ్లాక్ ఫంగస్ కేసు ఒకటి వెలుగు చూసినట్లు కొన్ని టీవీ ఛానళ్లలో బ్రేకింగ్ న్యూస్ రావడం గమనార్హం. మధిర నియోజకవర్గంలోని చింతకాని మండలం నేరడ గ్రామానికి చెందిన తాళ్లూరి భద్రయ్య అనే వ్యక్తికి బ్లాక్ ఫంగస్ లక్షణాలు కనిపించడంతో హైదరాబాద్ గాంధీ ఆసుపత్రికి రెఫర్ చేసినట్లు కొన్ని టీవీల్లో ప్రసారమైన వార్తల సారాంశం. ఇటీవలే కరోనా వైరస్ నుంచి కోలుకున్న భద్రయ్యకు బ్లాక్ ఫంగస్ లక్షణాలను ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు గుర్తించినట్లు కూడా పలు న్యూస్ ఛానళ్లు కొన్ని నివేదించాయి. దీంతో జిల్లా వ్యాప్తంగా బ్లాక్ ఫంగస్ వార్తలు కలకలానికి దారి తీశాయి. వాస్తవానికి భద్రయ్యకు బ్లాక్ ఫంగస్ లక్షణాలు ఉన్నట్లు ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి వర్గాలు గుర్తించాయా? ఇదీ అసలు ప్రశ్న. ఈ ప్రశ్నకు జవాబు కావాలంటే దిగువన గల భద్రయ్య ‘రెఫరల్ స్లిప్’ను నిశితంగా పరిశీలించాల్సిన అవసరముంది.
చూశారుగా ఖమ్మం ప్రభుత్వాసుపత్రి రెఫరల్ స్లిప్? ఏముందీ ఇందులో…? బాధితుడు భద్రయ్యకు బ్లాక్ ఫంగస్ లక్షణాలు ఉన్నట్లు ఎక్కడైనా ప్రభుత్వాసుపత్రి వైద్యులు ప్రస్తావించారా? ప్రయివేట్ ఆసుపత్రి నుంచి తమ వద్దకు వచ్చిన భద్రయ్యకు సైనసైటిస్ ప్రాబ్లమ్ ఉన్నట్లు ప్రస్తావించినట్లు కనిపిస్తోంది. మెదడు నుంచి కంటికి ఉండే నరం కనెక్షన్ దెబ్బతినడం వల్ల భద్రయ్య కంటికి ఇబ్బంది ఏర్పడినట్లు ప్రస్తావించారని వైద్య పరిభాష తెలిసిన డాక్టర్లు చెబుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లోనే గాంధీ ఆసుపత్రికి భద్రయ్యను పంపించారని, బ్లాక్ ఫంగస్ లక్షణాలు ఉన్నట్లు రెఫరల్ స్లిప్ లో ఎక్కడా ప్రస్తావించలేదని కూడా వైద్యవర్గాలు చెబుతున్నాయి. మొత్తంగా భద్రయ్య ఘటన ఇదిగో రెఫరల్ స్లిప్ అంటే… అదిగో బ్లాక్ ఫంగస్ అన్నట్లుగా వైద్యవర్గాలు భావిస్తున్నాయి… అదీ అసలు సంగతి.