పీఏసీ చైర్మెన్ అరికెపూడి గాంధీ, బీఆర్ఎస్ కు చెందిన హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిల మధ్య ఏర్పడిన వివాదంలో తెలంగాణా బీజేపీ తలదూర్చిందా…? అంటే ఔననే చెప్పాలి. తాజా వివాదంలో బీజేపీ రాజకీయ ప్రకంపనలు సృష్టించే ప్రయత్నం చేసిందనే వ్యాఖ్యలు ఈ సందర్భంగా వినిపిస్తున్నాయి. విషయం ఏమిటంటే..
అరికెపూడి గాంధీ, కౌశిక్ రెడ్డిల మధ్య ఏర్పడిన వివాదం, ఉద్రిక్త పరిస్థితులు తదితర పరిణామాల నేపథ్యంలో తెలంగాణా బీజేపీ సోషల్ మీడియా వేదికగా ఓ ఆసక్తికర పోస్ట్ చేసింది. ‘ఈ నాటకాన్ని నడుపుతున్న ఉత్తమ దర్శకుడు ఎవరో..?’ అంటూ కాప్షన్ జోడించి కౌశిక్ రెడ్డిని తోలుబొమ్మలా ఆడిస్తున్నట్లు ఓ ఇమేజ్ ను కూడా ఈ పోస్టులో క్రియేట్ చేశారు. ఈ ఇమేజ్ లో కౌశిక్ రెడ్డిని ఆడిస్తున్న వ్యక్తి రూపు రేఖలు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని పోలి ఉండడం గమనార్హం.
కాంగ్రెస్ పార్టీని, సీఎం రేవంత్ రెడ్డిని ఇరుకున పెట్టేందుకు కౌశిక్ రెడ్డిని ఆడిస్తున్నారనే అర్థం వచ్చేలా తెలంగాణా బీజేపీ సోషల్ మీడియా ద్వారా ఈ పోస్టును వ్యాప్తిలోకి తీసుకువచ్చిందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి కౌశిక్ రెడ్డి సమీప బంధువు కాగా, 2021 హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఈటెల రాజేందర్ పై పోటీ చేసేందుకు కౌశిక్ రెడ్డి ఆసక్తి చూపారు.
అయితే అప్పుడు పీసీసీ అధ్యక్ష పదవిలో గల సీఎం రేవంత్ రెడ్డి కౌశిక్ రెడ్డికి పార్టీ టికెట్ నిరాకరించడంతో ఆయన బీఆర్ఎస్ లో చేరారు. గత సాధారణ ఎన్నికల్లో ఈటెల రాజేందర్ పై బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన కౌశిక్ రెడ్డి గెలుపొందారు. ఈ పరిస్థితుల్లో తాజా వివాదం, పరిణామాల్లో రాజకీయ తుపాను క్రియేట్ చేసేందుకు బీజేపీ వేసిన ఎత్తుగడగా పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉండగా గాంధీ, కౌశిక్ రెడ్డిల వివాదంలో తల దూర్చేందుకు ఉత్తమ్ కుమార్ రెడ్డి సిద్ధంగా లేరని ఆయన సన్నిహితులు చెప్పినట్లు వార్తలు వచ్చాయి.