తెలంగాణా బీజేపీ కొత్త అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ తన పార్టీ బాధ్యతల తొలి అడుగును ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా భైంసా నుంచే ప్రారంభిస్తున్నారు. ‘హిందూత్వ’ బీజేపీ నేతగా ప్రాచుర్యం పొందిన సంజయ్ అధ్యక్ష బాధ్యతల స్వీకరణ సందర్భంగా తనదైన శైలిలో తీసుకున్న ఓ నిర్ణయం ఆ పార్టీ వర్గీయుల్లో చర్చకు దారి తీసింది.

బీజేపీ తెలంగాణా అధ్యక్షునిగా నియమితుడైన తర్వాత సంజయ్ ఈనెల 15న తొలిసారి రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో అడుగిడుతున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్ మహానగరంలో భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించి సంజయ్ కు స్వాగతం పలికేందుకు రాజధాని కేంద్రంలోని పార్టీ నేతలు, కార్యకర్తలు నిర్ణయించారు. శంషాబాద్ నుంచి హెలీకాప్టర్ ద్వారా బేగంపేట వరకు చేరుకున్న తర్వాత, అక్కడి నుంచి పార్టీ కార్యాలయం వరకు పెద్ద ఎత్తున స్వాగత సంబరాలతో ర్యాలీ నిర్వహిస్తూ సంజయ్ ను తోడ్కొని వచ్చే విధంగా కార్యక్రమాన్ని రూపొందించారు.

అయితే కరోనా వైరస్ వ్యాప్తి, తాజా పరిణామాల నేపథ్యంలో తెలంగాణా సర్కార్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇందులో భాగంగానే విద్యా సంస్థలకు ఈనెల 31వ తేదీ వరకు సెలవు ప్రకటించారు. అంతేగాక షాపింగ్ మాల్స్, సినిమా థియేటర్లను సైతం మూసివేయాలని సీఎం అధ్యక్షతన జరిగిన హైలెవెల్ కమిటీ నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే సంజయ్ ర్యాలీని అనివార్య కారణాల వల్ల రద్దు చేసినట్ల బీజేపీ నాయకులు ప్రకటించారు. ఢిల్లీ పెద్దల సూచన మేరకు కరోనా ఎఫెక్ట్ కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.

ఈ పరిణామాల్లో సంజయ్ ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి చేరుకుని అధ్యక్షునిగా పదవీ బాధ్యతలు స్వీకరిస్తారు. విశేషమేమిటంటే ఈ సందర్భంగా తనకోసం ఎవరూ శాలువాలు, బొకేలు తీసుకురావద్దని సంజయ్ పార్టీ కేడర్ కు పిలుపునివ్వడం. వాటికోసం వెచ్చించే నగదును విరాళాలుగా సేకరించాలని, ఆయా మొత్తాన్ని భైంసా బాధితులకు అందించాలని సంజయ్ నిర్ణయించారు. తన వినతిని ప్రతి కార్యకర్త, నాయకుడు అర్థం చేసుకుని సహకరించాలని అభ్యర్థించారు.

Comments are closed.

Exit mobile version