మంత్రివర్గం నుంచి బర్తరఫ్ కు గురైన మాజీ మంత్రి ఈటెల రాజేందర్ బీజేపీలో చేరుతారా? లేదా? ఆయన ఇంకా ఊగిసలాటలోనే ఉన్నారా? రాజకీయంగా ఈటెల వేస్తున్న అడుగులపై మీడియాలోనూ సంశయాత్మక కథనాలే వచ్చాయి… ఇంకా వస్తున్నాయి కూడా. మొత్తంగా ఈటెల బీజేపీలో చేరిక ఖాయమేనంటూ తేదీలను కూడా ప్రముఖ పత్రికలు సైతం ప్రశ్నార్థక చిహ్నాలతో ప్రచురిస్తున్నాయి. అటూ, ఇటూ ఊగి… చివరికి ‘ఆత్మరక్షణ’లో భాగంగానే ఈటెల రాజేందర్ బీజేపీలో చేరుతారనే కాసేపు అనుకుంటే…? ఏం జరుగుతుంది? ఇదీ అసలు ప్రశ్న. ఆయన బీజేపీలో అధికారికంగా చేరితే.., కాషాయ కండువా కప్పుకుంటే అనర్హత వేటు పడకుండా ముందే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాల్సి ఉంటుంది. కాషాయ కండువాను కప్పుకోకుండా కేవలం బీజేపీ అగ్రనేతలను కలిసి, వారి అండదండలను మాత్రమే స్వీకరిస్తే మాత్రం సాంకేతికంగా టీఆర్ఎస్ ఎమ్మెల్యేగానే కొనసాగే వీలుందనేది పరిశీలకుల అంచనా. కానీ ఇంత జరిగాక కూడా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండా ఈటెల రాజేందర్ బీజేపీలో చేరగలరా? ఇదీ ఓ ప్రశ్నే. ఒక వేళ రాజీనామా చేశాకే బీజేపీలో చేరితే మాత్రం తాను ప్రాతినిధ్యం వహిస్తున్న హుజూరాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే పదవికి ఉప ఎన్నిక అనివార్యం. ఇదే జరిగితే టీఆర్ఎస్ అభ్యర్థి ఎవరనేది మాత్రం వేరే ప్రశ్న. కానీ బీజేపీ అభ్యర్థి మాత్రం ఈటెల రాజేందరే కావచ్చు. లేదంటే మీడియాలో, సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం ప్రకారం ఈటెల రాజేందర్ కు బీజేపీ కేంద్ర సహాయ మంత్రి పదవిని ఇస్తే, హుజూరాబాద్ లో బీజేపీ అభ్యర్థిగా ఈటెల జమున పోటీలోకి దిగే అవకాశాలున్నాయి. మొత్తంగా బీజేపీ అభ్యర్థి రాజేందరా? జమునా? ఈ ఇద్దరిలో ఎవరో ఒకరు మాత్రం ఖాయంగానే ప్రచారం జరుగుతోంది. కానీ..,
అసలు హుజూరాబాద్ నియోజవర్గంలో బీజేపీ అభ్యర్థిగా రాజేందర్ లేదా జమున బరిలోకి దిగితే గెలిచేందుకు అవకాశముందా? ఇదీ తాజా సందేహం. ఎందుకంటే గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థికి లభించిన ఓట్లు రాజకీయంగా భారీ సందేహాన్ని కలిగిస్తున్నాయి. విశేషమేంటంటే గత అసెంబ్లీ ఎన్నికల్లో ‘నోటా’కంటే బీజేపీ అభ్యర్థికి తక్కువ ఓట్లు లభించడం. పోలైన ఓట్లలో టీఆర్ఎస్ అభ్యర్థి 59.34 శాతంతో లక్షా నాలుగు వేల 840 ఓట్లను పొందారు. కాంగ్రెస్ అభ్యర్థి పాడి కౌషిక్ రెడ్డికి 34.60 శాతంతో 61,121 ఓట్లు లభించగా, ఈటెల రాజేందర్ 43,719 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన పుప్పాల రఘుకు 1,683 ఓట్లు లభించగా, నోటాకు 2,867 ఓట్లు వచ్చాయి. గమనించాల్సిన విషయమేమిటంటే బరిగె గట్టయ్య యాదవ్ అనే స్వతంత్ర అభ్యర్థికి 2,660 ఓట్లు లభించగా, బీజేపీ అభ్యర్థికి లభించిన ఓట్లు అంతకన్నా తక్కువగా ఉండడం. అయితే ఆ తర్వాత 2019 మే నెలలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ కుమార్ కు హుజూరాబాద్ సెగ్మెంట్ లో సుమారు 26 వేల పైచిలుకు ఓట్లు రావడం విశేషం.
ఈ పరిస్థితుల్లో ఈటెల రాజేందర్ బీజేపీలో చేరి పోటీ చేస్తే గెలుపొందగలరా? అనే ప్రశ్నపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. స్థానికంగా బీజేపీకి ఎంతో కొంత కేడర్ ఉన్నప్పటికీ, ఈటెల చేరిక వార్తలపై ప్రస్తుతం బీజేపీలో గల ఒకప్పటి టీడీపీ సీనియర్ నేత ఇనుగాల పెద్దిరెడ్డి గుర్రుమంటున్నారు. ఎవరినడికి ఈటెలను చేర్చుకుంటున్నారని ఆయన ప్రశ్నిస్తున్నారు. ఈటెల బీజేపీలోకి వస్తే మరో ఉప్పెన తప్పదని, తన రాజకీయ భవిష్యత్తును తానూ చూసుకుంటానని పెద్దిరెడ్డి హెచ్చరిస్తున్నారు. అంటే పరిస్థితులను బట్టి పెద్దిరెడ్డి టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నా ఆశ్చర్యం లేదంటున్నారు. మరోవైపు ఈటెల అభిమానుల, అనుయాయుల, వర్గీయుల సంఖ్య రోజురోజుకూ హుజూరాబాద్ లో తగ్గుతోందనే వార్తలు వస్తున్నాయి. టీఆర్ఎస్ కు చెందిన స్థానిక ప్రజాప్రతినిధులను అధికార పార్టీ హ్యాపీగా ఉంచే ప్రక్రియను ప్రారంభించిందనే ప్రచారం కూడా ఉండనే ఉంది. ఈ పరిస్థితుల్లో ఈటెల రాజేందర్ కాషాయ పార్టీ కండువా కప్పుకుంటే, హుజురాబాద్ లో ఉప ఎన్నిక అనివార్యమైతే… బీజేపీ బలం, రాజేందర్ ప్రదర్శించే సత్తాపై సహజమైన చర్చే జరుగుతోంది.