‘బండి సంజయ్ బత్తాయి లాంటి లీడర్. బండి సంజయ్ కాదు. తొండి సంజయ్. కేంద్రంలో మీ ప్రభుత్వమే ఉంది. బిడ్డా… సంజయ్ 2023 వరకు ఎందుకు? నీకు దమ్ముంటే ఇప్పుడే నాపై విచారణ జరిపించు… ఆరోపణలు నిరూపించు…’ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఈనెల 10వ తేదీన చేసిన సవాల్ ఇది. అంతకు రెండు రోజుల ముందు బీజేపీ తెలంగాణా అధ్యక్షుడు బండి సంజయ్ ఖమ్మం నగరంలో పర్యటించి మంత్రి అజయ్ కుమార్ టార్గెట్ గా తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. పరుష పదజాలంతో వ్యాఖ్యలు కూడా చేశారు. మంత్రి కుటుంబానికి చెందిన మమత మెడికల్ కళాశాల, ఎన్నెస్పీ భూముల రెగ్యులరైజేషన్ తదితర అంశాలను ప్రస్తావిస్తూ సంజయ్ పలు ఆరోపణలు చేశారు. అంతేకాదు కాంట్రాక్టుల అంశాన్ని కూడా సంజయ్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. ‘అన్ని కాంట్రాక్టులు నీకే. వేరే ఏ కాంట్రాక్టరును రానియ్యవ్’ అంటూ తీవ్ర పదజాలంతో సంజయ్ ఆరోపణలు గుప్పించారు. బీజేపీ అధ్యక్షుని ఆరోపణలకు జవాబుగా మంత్రి అజయ్ కూడా ఆ తర్వాత ధీటుగానే స్పందించారు.
ఈ నేపథ్యంలోనే మంత్రి అజయ్ చేసిన సవాల్ ను బీజేపీ అధ్యక్షుడు సంజయ్ స్వచ్ఛందంగా స్వీకరించారా? ఇందుకు సంబంధించి ఓ ప్రత్యేక టీంను నియమించి నిర్వహించాల్సిన ‘టాస్క్’ ను అప్పగించారా? మంత్రికి సంబంధించిన అన్ని వ్యాపార కార్యకలాపాలపైనా సమగ్ర సమాచార సేకరణలో సంజయ్ నియమించిన స్పెషల్ టీమ్ నిమగ్నమైందా? ముఖ్యంగా మమత మెడికల్ కళాశాలను టార్గెట్ చేస్తూ సంజయ్ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ)కు లిఖిత పూర్వక ఫిర్యాదు చేయనున్నారా? అనే ప్రశ్నలకు ఔననే రీతిలో సరికొత్త ప్రచారం సాగుతోంది. ఆయా ప్రచారపు సారాంశం ప్రకారం మంత్రి విసిరిన సవాల్ ను బీజేపీ సంజయ్ స్వీకరించి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. అందులో భాగంగానే వివిధ రంగాల్లో నిపుణులైన కొందరు వ్యక్తులను ఎంపిక చేసి హైదరాబాద్ నుంచి ఓ బృందంగా ఖమ్మం నగరానికి పంపినట్లు తెలుస్తోంది. అయితే ఈ టీమ్ కు అప్పగించిన ‘టాస్క్’ ఏమిటనే అంశంపై భిన్న ప్రచారం సాగుతోంది.
రాజకీయంగా విమర్శలు, ఆరోపణల సంగతి ఎలా ఉన్నప్పటికీ, మంత్రి కుటుంబ సభ్యుల వ్యాపార కార్యకలాపాలపైనే బీజేపీ రాష్ట్ర నాయకత్వం ప్రధాన దృష్టిని కేంద్రీకరించినట్లు ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా మంత్రి కుటుంబ సభ్యులకు చెందినట్లు భావిస్తున్న కన్ స్ట్రక్షన్ కంపెనీ నిర్వహిస్తున్న పనులకు సంబంధించి లోతైన సమాచార సేకరణ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే స్థాపించినట్లు పేర్కొంటున్న ఈ కంపెనీ నగరంలో చేస్తున్న కాంట్రాక్టు పనులేమిటి? అసలు ఈ కంపెనీకి గల పూర్వ అనుభవం ఏమిటి? ఎన్ని కోట్ల రూపాయల విలువైన పనులను ఆయా కంపెనీ చేస్తున్నది? అదేవిధంగా ఎన్నెస్పీ భూముల క్రమబద్ధీకరణ, మెడికల్ కళాశాల నిర్వహణ తీరుతెన్నుల్లో ఏవేని లోపాలు ఉన్నాయా? అనే కోణాల నుంచి ప్రత్యేక బృందం సమాచారాన్ని సేకరిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇందుకు అజయ్ అధిపత్యాన్ని జీర్ణించుకోలేని సొంత పార్టీలోని వర్గీయులే కొందరు, కాంట్రాక్టు వర్గాలు కూడా పూర్తి స్థాయిలో సంజయ్ టీంకు సహరిస్తున్నట్లు సమాచారం. ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో మంత్రి కుటుంబ సభ్యుల వ్యాపారాలనే ప్రధానంగా ప్రజల ముందుంచి ప్రచారం నిర్వహించాలని కూడా బీజేపీ నేతలు ఎజెండాలోని ముఖ్యాంశంగా నిర్ణయించినట్లు తెలుస్తోంది.
దీంతో నగర పాలక సంస్థల ఎన్నికలు తరుముకొస్తున్న వేళ బండి సంజయ్ ఆరోపణలు, అందుకు ప్రతిగా మంత్రి అజయ్ విసిరిన సవాల్ తాజాగా మళ్లీ తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. అయితే ఈ విషయంలో బీజేపీ ప్రత్యేక బృందానికి ఏదేని కీలక సమాచారం లభిస్తుందా? బీజేపీ నేతలు అనుమానిస్తూ, ఆశించిన సమాచారం లభ్యమైతే ఆ తర్వాత జరిగే పరిణామాలు ఏమిటి? అనే ప్రశ్నలపైనా భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ‘మీ ముఖ్యమంత్రే కేంద్ర పెద్దల వద్దకు వెళ్లి వంగి వంగి పొర్లు దండాలు పెడుతున్నాడు. ఫస్ట్ నీ సంగతే తేలుస్తాం’ అని సంజయ్ ఖమ్మం పర్యటనలో మంత్రి పువ్వాడను ఉద్ధేశించి వ్యాఖ్యానించడం, ‘బిడ్జా సంజయ్… 2023 వరకు దేనికి? దమ్ముంటే ఇప్పుడే విచారణ జరిపించు’ అని మంత్రి అజయ్ సవాల్ చేయడం ఈ సందర్భంగా గమనార్హం.