చందుపట్ల జంగారెడ్డి… తెలంగాణాలో ఆయన అభిమానులు ఇప్పటికీ ముద్దుగా పిలుచుకునే పేరు జంగన్న. ఉత్తరాది బీజేపీ నేతలు ముఖ్యంగా ఎల్ కే ఆడ్వాణీ, మురళీ మనోహర్ జోషి, వాజపేయి వంటి అగ్ర నాయకులు ‘జంగా జీ’ అని పిలిచిన రోజులు జంగారెడ్డి రాజకీయ జీవితంలో దశాబ్ధాల క్రితం ఓ తీపి గురుతు మాత్రమే. ఎవరీ జంగారెడ్డి? ఏంటి ఇతని నేపథ్యం…? అంటే ఈ తరానికి తెలియని బీజేపీలోని వినూత్న సీనియర్ నేత. బీజేపీగా రూపాంతరం చెందకముందు జనసంఘ్ పార్టీ తరపున గెలిచిన ఎమ్మెల్యేల్లో జంగారెడ్డి కూడా ఉన్నారు.
జనసంఘ్ కాస్తా బీజేపీగా మారాక జరిగిన తొలి పార్లమెంట్ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా ఆ పార్టీ విజయం సాధించింది కేవలం రెండంటే రెండే ఎంపీ స్థానాల్లో. గుజరాత్ లోని మెహసేన పార్లమెంట్ స్థానం నుంచి డాక్టర్ ఏకే పటేల్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని హన్మకొండ నుంచి చందుపట్ల జంగారెడ్డి ఘన విజయం సాధించారు. అప్పట్లో ఏకే పటేల్, చందుపట్ల జంగారెడ్డి దేశవ్యాప్తంగా చర్చనీయాంశ బీజేపీ ఎంపీలు. కాంగ్రెస్ హవాలో ఎదురొడ్డి నిలిచిన ఏకే పటేల్, జంగారెడ్డిల విజయం బీజేపీ శ్రేణుల్లో ఇప్పటికే కాదు, ఎప్పటికీ మరపురాని తీపి జ్ఞాపకం. బీజేపీ ఉన్నంత వరకు అప్పటి ఈ రెండు సీట్ల గెలుపు కూడా చరిత్రలో చెరగని ముద్ర… ఇందులో ఏ సందేహం లేదు.
అటువంటి జంగారెడ్డి బీజేపీలో ప్రస్తుతం ఎవరికీ పట్టని ఓ వృద్ధ నేత మాత్రమే. కానీ జంగారెడ్డి రాజకీయ ఎదుగుదల ఓ విషాదకర జర్నీగా అభివర్ణించక తప్పదు. 1984 ఎన్నికల్లో దేశంలోనే విజయం సాధించిన ఇద్దరు బీజేపీ ఎంపీల్లో ఒకరైన జంగారెడ్డికి 1989 ఎన్నికల్లో టికెట్ దక్కకపోవడం ఇక్కడి అణచివేత రాజకీయాలకు నిదర్శనంగా ఆ పార్టీ శ్రేణులే అభివర్ణిస్తుంటాయి. అనంతరం 1994 ఎన్నికల్లో తాను గతంలో విజయం సాధించిన హన్మకొండ నుంచి కాకుండా జంగారెడ్డికి వరంగల్ టికెట్ కేటాయించడం గమనార్హం. అనంతర పరిణామాల్లో జనసంఘ్ నుంచి విజయం సాధించిన శాయంపేట నుంచి కాకుండా సంబంధం లేని కరీంనగర్ జిల్లాలో ఎమ్మెల్యే టికెట్ కేటాయించడం కూడా బీజేపీకే చెల్లింది.
ఆయా పరిణామాలకు ఆంధ్రాకు చెందిన బీజేపీ నేతల అణచివేత రాజకీయ వైఖరి ప్రధాన కారణమని తెలంగాణా బీజేపీ శ్రేణులు ఇప్పటికీ బలంగా విశ్వసిస్తుంటాయి. ఈ పరిస్థితుల్లోనే 1994 ప్రాంతంలో ‘ఇక తెలంగాణా బీజేపీ’ అనే శీర్షికతో ఇండియన్ ఎక్స్ ప్రెస్ గ్రూపునకు చెందిన తెలుగు దినపత్రికలో ఓ వార్తా కథనం ప్రచురితమైంది. ‘తెలంగాణా’ అనే పదాన్ని ఉచ్ఛరించడానికే ఇష్టపడని ఆంధ్రా బీజేపీ నేతలు అగ్గిలం మీద గుగ్గిలమయ్యారు. ఆయా వార్తా కథనానికి జంగారెడ్డితోపాటు మరికొందరు నేతలు కారణమంటూ తమకు తాము తీర్పు చెప్పుకున్నారు. ఆయా నేతలందరిపైనా బీజేపీ నాయకత్వ పగ్గాలు గల ఆంధ్రా నేతలు రాజకీయ ప్రతీకారం తీర్చుకున్నారనే వాదన ఇప్పటికీ వినిపిస్తుంటుంది.
ఇప్పుడీ సంగతులన్నీ ఎందుకంటే… దేశ ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణాకు చెందిన సీనియర్ బీజేపీ నేతలకు ఫోన్ చేసి మాట్లాడారు. వారిలో ఎస్వీ శేషగిరిరావు, మందాడి సత్యనారాయణరెడ్డిలతోపాటు చందుపట్ల జంగారెడ్డి కూడా ఉన్నారు. ఆయా నేతల యోగక్షేమాలను ప్రధాని అడిగి తెలుసుకున్నట్లు వార్తల సారాంశం. లోక్ సభలో బీజేపీకి ఇద్దరు ఎంపీలు ఉన్న సమయంలో మీరు ఒకరని, దేశానికి బాగా సేవ చేశారని ప్రధాని జంగారెడ్డితో చెబుతూ గుర్తు చేశారట.
హబ్బ… జంగారెడ్డి ఎంత లక్కీ పొలిటీషియనో? ఈ తరానికి అంతగా గుర్తు తెలియని జంగారెడ్డి వంటి సీనియర్ నేతకు మోదీ ఫోన్ చేశారంటే సాధారణ విషయం కాదని భావిస్తే మాత్రం పొరపాటే అవుతుంది. ఎందుకంటే ప్రస్తుతం జంగారెడ్డి వయస్సు దాదాపు 86 సంవత్సరాలు. బీజేపీకి ఆయన చాలా చేశారు. దేశంలోనే పార్టీ ఉనికిని పార్లమెంటులో ప్రస్ఫుటింపజేశారు. జీవిత చరమాంకలోనైనా పార్టీకి తాను చేసిన సేవలను గుర్తించాలని, శేష జీవితంలో ఏదో ఒక పదవి ఇవ్వాలని కొంత కాలం క్రితం వరకు కూడా ఢిల్లీలో జంగారెడ్డి చెప్పులరిగేలా తిరిగారట. కానీ ఎవరూ పట్టించుకోలేదట. ఆయన ఎవరెవరి చుట్టూ తిరిగారన్నది సందర్భానుసారం మరో కథనంలో ప్రస్తావించుకుందాం.
అయితేనేం…? ఎట్టకేలకు ప్రధాని మోదీకి జంగారెడ్డి గుర్తొచ్చారు. ఆయన యోగక్షేమాల గురించి ఆరా తీశారు. పార్టీకి చేసిన సేవలను ఫోన్ ద్వారా కొనియాడారు. ‘జంగన్న’కు చివరాఖరున దక్కింది మోదీ ఫోన్ కాల్ మాత్రమే. ఎందుకంటే దశబ్ధాల క్రితమే తెలంగాణా నేతలపై ఆంధ్రా బీజేపీ నేతల అణచివేతను జంగన్న ధిక్కరించారు. అందుకే ఆయనకు ఈ తరహా గుర్తింపు. కొసమెరుపు ఏంటంటే… ఇంత జరిగినా జంగారెడ్డి ఇప్పటికీ బీజేపీనే అంటిపెట్టుకున్నారు. కాషాయపు కండువాను మార్చలేదు.