దుబ్బాక ఉప ఎన్నికల ఫలితం తర్వాత మాంచి ఊపులో ఉన్న బీజేపీ తెలంగాణాపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించింది. ఇందులో భాగంగానే 2023 ఎన్నికల్లో అధికారమే లక్ష్యం దిశగా పావులు కదుపుతోంది. ఇందుకోసం రెండంచెల విధానాన్ని ఎంపిక చేసుకున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. గత పార్లమెంట్ ఎన్నికల్లో అనూహ్యంగా నాలుగు ఎంపీ స్థానాలను దక్కించుకున్న బీజేపీ అధిష్టానానికి సహజంగానే తెలంగాణాపై దృష్టి పడిందంటున్నారు. దుబ్బాక ఉప ఎన్నికల్లో సాధించిన విజయం ఇందుకు మరింత ఊతమిచ్చినట్లు పార్టీ శ్రేణులు అభిప్రాయపడుతున్నాయి. అందువల్లే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలపై కేంద్ర హో మంత్రి అమిత్ షా ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించారంటున్నారు.
వాస్తవానికి దక్షిణ తెలంగాణాలో బీజేపీకి అస్సలు పట్టు లభించడం లేదు. ఇందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నప్పటికీ, పరిస్థితి ఆశాజనకంగా ఉన్నట్లు ఇన్నాళ్లు కనిపించలేదు. దక్షిణాదిలోని కర్నాటకలో అధికారంలో ఉండడం కాస్త ఉపశమనమే అయినప్పటికీ, మిగతా రాష్ట్రాలపై మాత్రం పెద్దగా పట్టు లభించడం లేదు. తమిళనాడులో అమలు చేస్తున్న రాజకీయ ప్లాన్లు తరచూ మారుతూనే ఉన్నాయి. కేరళలో గ్రిప్ కోసం యుద్ధం సాగుతోంది. ఆంధ్రప్రదేశ్ పై బీజేపీ అధిష్టానానికి పెద్దగా ఆశలు కూడా ఉన్నట్లు లేదు. ఇక మిగిలింది తెలంగాణా రాష్ట్రం మాత్రమే. పార్టీకి ఓ మంత్రి సహా నలుగురు ఎంపీలు గల తెలంగాణా రాష్ట్రంలో పాగా వేయడానికి ‘దుబ్బాక’ ఫలితం మాంచి టానిక్ లా పని చేసిందంటున్నారు.
ఈ నేపథ్యంలోనే జీహెచ్ఎంసీ ఎన్నికల నగారా మోగింది. ఎన్నికల నోటిఫికేషన్ కు రెండు రోజుల ముందే బీజేపీ ఈ విషయంలో అప్రమత్తం కావడం గమనార్హం. గ్రేటర్ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా జాతీయ నేతలతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయడం ఇందులో భాగమేనని బీజేపీ శ్రేణులు అంటున్నాయి. కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు అత్యంత సన్నిహితునిగా భావిస్తున్న ఎంపీ భూపేంద్ర యాదవ్ ఇంచార్జిగా, ఐదుగురు జాతీయ నేతలతో ఎన్నికల ప్రత్యేక కమిటీని నియమించారు. మంత్రి సుధాకర్ ను సహ ఇంచార్జిగా, మహారాష్ట్రకు చెదిన ఆశిష్ షెల్లర్, గుజరాత్ కు చెందిన ప్రదీప్ సింగ్ వాఘేలా, కర్నాటకకు చెందిన సతీష్ రెడ్డిలను ప్రత్యేక కమిటీ సభ్యులుగా నియమించారు. అమిత్ షాకు అత్యంత సన్నిహితునిగా పేరుగాంచిన భూపేంద్ర యాదవ్ ను స్పెషల్ కమిటీని ఏర్పాటు చేయడాన్ని బీజేపీ కేడర్ ప్రత్యేకంగా ప్రస్తావిస్తోంది. ఓ రకంగా అమిత్ షానే హైదరాబాద్ లో మకాం వేసినట్లుగా ఈ కమిటీ ఏర్పాటుపై పార్టీ వర్గాలు అభివర్ణిస్తున్నాయి.
జీహెచ్ఎంసీ ఎన్నికల కోసం ఐదుగురు జాతీయ నాయకులతో కమిటీ ఏర్పాటు చేయడంలోనే అసలు ప్రత్యేకత దాగి ఉందంటున్నారు. అంతర్జాతీయ నగరంగా ప్రాచుర్యం పొందిన హైదరాబాద్ నగర పాలక సంస్థపై కాషాయ జెండా ఎగురవేస్తే దాని ప్రభావం దక్షిణాది రాష్ట్రాల్లో పడుతుందనేది బీజేపీ వ్యూహంగా చెబుతున్నారు. కాస్మోపాలిటన్ సిటీ హైదరాబాద్ లో బీజేపీ విజయం సాధిస్తే దక్షిణాదిలోనేగాక, ఉత్తరాదిలోని పలు రాష్ట్రాల్లో కూడా పార్టీ మరింత పటిష్టం కావడానికి దోహదపడుతుందనే ప్లాన్ గా చెబుతున్నారు. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన వ్యాపారులు హైదరాబాద్ నగరంలో ఉన్నారని, ఈ ఎన్నికల్లో వారి ఓట్లను కొల్లగొట్టేందుకు వివిధ రాష్ట్రాలకు చెందిన నేతలతో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయడం పకడ్బందీ వ్యూహమని అంటున్నారు. గుజరాతీ, మరాఠీల ఓట్ల విషయంలో అధికార టీఆర్ఎస్ పార్టీకి ఈ తరహా అడ్వాంటేజ్ లేదనే భావనను బీజేపీ నేతలు వ్యక్తం చేస్తున్నారు.
మొత్తంగా తెలంగాణాలో బీజేపీ అధికారంలోకి రావడానికి పార్టీ అధిష్టానం రెండంచెల విధానాన్ని ఎంచుకుందంటున్నారు ‘నువ్వు అధికారంలోకి రావాలంటే ముందు ప్రతిపక్ష స్థానంలోకి రావాలి. ఆ తర్వాత మాత్రమే అధికారం చేపట్టడం సాధ్యమవుతుంది. ఎప్పుడూ మూడో స్థానంలోనే ఉంటే విపక్ష స్థానానికి చేరేదెన్నడు? అధికారానికి చేరువయ్యేదెన్నడు?’ అనే ప్రశ్నలు ఫార్ములాగా పథక రచన చేశారంటున్నారు. ‘అందువల్ల తెలంగాణాలో కాంగ్రెస్ ను ప్రతిపక్ష స్థానం నుంచి వెనక్కి నెట్టడడమే ప్రస్తుత బీజేపీ లక్ష్యం. ఆ తర్వాత అధికార పీఠం అధిష్టించేందుకు రెండో స్థానం నుంచి పోరాడవచ్చు. అందుకే ఇప్పుడు బీజేపీ లక్ష్యం కాంగ్రెస్ ను మూడో స్థానంలోకి నెట్టడం. అంటే… జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మేయర్ స్థానాన్ని దక్కించుకోవడం. తద్వారా తెలంగాణాలో బీజేపీ బలాన్ని దేశవ్యాప్తంగా ప్రదర్శించడం. వచ్చే అసెంబ్లీ ఎన్నికలనాటికి అధికారంలోకి రావడమే లక్ష్యంగా టీఆర్ఎస్ పార్టీతో తలపడడం. ఇదీ అసలు లక్ష్యం’ అంటున్నాయి బీజేపీ శ్రేణులు. మొత్తంగా ఆయా లక్ష్యాల సాధనకు అమలు పరిచే వ్యూహం యావత్తూ కేంద్ర హోం మంత్రి అమిత్ షా కనుసన్నల్లోనే జరుగుతోందని బీజేపీ నేతలు కొందరు పేర్కొంటున్నారు.