దాదాపుగా వెలువడిన జీహెచ్ంఎంసీ ఎన్నికల తుది ఫలితాలను తీక్షణంగా పరికించారుగా? విషయం బోధపడినట్లేగా? ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి కొత్తగా ఒరిగిందేమీ లేదు. గతంలోనూ రెండు సీట్లు, ఇప్పుడూ అవే రెండు స్థానాలు. ఎంఐఎం పార్టీ తన పట్టును నిలుపుకున్నట్లే. గత ఎన్నికల్లో ఆ పార్టీ 44 డివిజన్లు కైవసం చేసుకోగా, ఈసారి 43 స్థానాల్లో విజయం సాధించింది. తెలుగుదేశం పార్టీకి గతంలో ఓ స్థానం ఉండగా, ఇప్పుడు అది కూడా లేకుండాపోయిన దుస్థితి.
ఈ నేపథ్యంలోనే 2016 ఎన్నికల్లో కేవలం 4 స్థానాల్లో గెలుపొందిన బీజేపీ ఈసారి ఇప్పటికే 44 డివిజన్లలో విజయం సాధించగా, మరో ఐదు స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నట్లు తాజా వార్తల సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. టీఆర్ఎస్ 55 స్థానాల్లో గెలుపొందగా, మరో స్థానంలో లీడ్ లో ఉంది. గత ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ 99 స్థానాల్లో రికార్డు స్థాయి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. తాజా లెక్కల ప్రకారం బీజేపీ ఇప్పటికే 44 స్థానాలను కైవసం చేసుకుంది.
ఆధిక్యతలో గల ఐదు స్థానాలను మినహాయించినా బీజేపీ ఖాతాలో ఈసారి ఇప్పటికే అదనంగా చేరిన 40 స్థానాలు ఎవరి నుంచి వచ్చాయో అర్థమైనట్లేగా. అంటే టీఆర్ఎస్ పార్టీకి గత ఎన్నికల్లో లభించిన స్థానాల సంఖ్యకే బీజేపీ భారీ గండి కొట్టిందన్నమాట. ఆయా అంశాన్ని బోధపరుస్తూ ఓ కార్టూనిస్టు మిత్రుడు ts29 పాఠకుల కోసం ప్రత్యేకంగా ఓ కార్టూన్ గీసి ఇచ్చారు.