రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి దేశం విడిచి వెళ్లిపోతారా? రాజకీయ పరిణామాలు అందుకు ఊతం కల్పిస్తున్నాయా? ఆయన తాజా వ్యాఖ్యలు చూస్తుంటే ఇవే అనుమానాలు కలుగుతున్నాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. ఆయన దేశం విడిచి వెళ్లిపోకుండా పాస్ పోర్టును సీజ్ చేయాలని కూడా పోలీసులను కోరుతున్నారు.
తెలుగుదేశం పార్టీ తరపున రాజ్యసభకు ఎన్నికైన సుజనాచౌదరి మారిన రాజకీయ పరిణామాల్లో బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. అయితే ఏపీ రాజధాని అమరావతి ‘మూడు ముక్కల’ ఆందోళన నేపథ్యంలో సుజనా చౌదరి చేసినట్లు పేర్కొంటున్న వ్యాఖ్యలపై వైఎస్ఆర్ సీపీ నాయకులు అగ్గిలం మీద గుగ్గిలమవుతున్నారు. ఆయనపై దేశద్రోహం కేసు పెట్టాలని పోలీసులకు ఫిర్యాదు కూడా చేయడం విశేషం. ఇంతకీ సుజనా చౌదరి ఏమన్నారో ఆయన మాటల్లోనే చదవండి.
‘ఒకవేళ గనుక దీన్ని మనం చూస్తూ ఊరుకుంటే నేరాలు…ఘోరాలు జరుగుతున్నయ్. ఇక ఇక్కడ సిటిజన్ గా ఉండటమే వేస్ట్. మనం రెఫ్యూజీగా వేరే చోటకు వెళ్లిపోవటమే మేలు. ఈ దేశంలో ఉండటమే అనవసరం. కాబట్టి మీరందరూ కలిసి రండి. దీన్ని సపోర్ట్ చేయండి.’ అంటూ సుజనా చౌదరి చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి.
సుజనాచౌదరి చేసిన ఆయా వివాదాస్పద వ్యాఖ్యలపై సహజంగానే వైఎస్ఆర్ సీపీ నేతలు మండి పడ్డారు. ఇందులో భాగంగానే అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్ నాథ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాజ్యాంగాన్ని అవమానపర్చిన సుజనాచౌదరిపై దేశద్రోహం అభియోగం కింద కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. సుజనాచౌదరి పాస్ పోర్టును సీజ్ చేయాలని కూడా కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కోరుతూ లేఖ రాశారు.