బండి సంజయ్ కుమార్. బీజేపీ తెలంగాణా రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు కూడా. కరీంనగర్ మున్సిపల్ కౌన్సిలర్ గా, కార్పొరేటర్ గా వ్యవహరించిన బండి సంజయ్ గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అనంతరం పార్లమెంట్ ఎన్నికల్లో తలపడి కేసీఆర్ కుడిభుజంగా వ్యవహరించే బోయినపల్లి వినోద్ కుమార్ ను ఓటమి బాట పట్టించి చరిత్ర సృష్టించారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణా సీఎం కేసీఆర్ కు ఏమాత్రం రుచించని నాలుగు ఎంపీ సీట్ల ఫలితాల్లో సంజయ్ గెల్చిన కరీంనగర్ స్థానం కూడా ఒకటి.
తెలంగాణా బీజేపీ అధ్యక్ష స్థానంకోసం అనేక మంది సీనియర్లు తలపడినా సంజయ్ నాయకత్వంవైపే ఆ పార్టీ అధిష్టానం మొగ్గు చూపింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి బీజేపీని సంజయ్ తెలంగాణాలో అధికారంలోకి తీసుకువస్తాడని ఆ పార్టీ పెద్దలు ప్రగాఢంగా విశ్వసిస్తున్నారు కూడా.
కానీ రాజకీయంగా సంజయ్ వేస్తున్న అడుగులేమిటి? దాదాపు రెండు గంటల క్రితం బండి సంజయ్ చేసిన ఈ ట్వీట్ ను నిశితంగా పరిశీలించండి. మీకే బోధపడుతుంది. పోలీసులకు కరోనా చికిత్స విషయంలో పోలీసు శాఖకు చెందిన సంక్షేమ విభాగాపు అదనపు డీజీ ఈ నెల 8వ తేదీన ఓ సర్క్యులర్ జారీ చేశారు. శాఖాపరంగా ఉద్యోగులకు అంతర్గతంగా జారీ చేసిన లేఖ మాత్రమే ఇది. దీన్ని పట్టుకుని ప్రభుత్వ జీవో అంటున్నారు బండి సంజయ్.
బండి సంజయ్ భావన ప్రకారం… ఈ జీవో (?)లో ఏముంది అంటే… కరోనా సోకిన పోలీసులు గాంధీ ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన వార్డులో మాత్రమే చికిత్స చేయించుకోవాలని, అందుకు విరుద్ధంగా ‘ఎంపానెల్డ్’ ఆసుపత్రుల్లో వైద్యం చేయించుకుంటే ఈహెచ్ఎస్ స్కీం కింద ప్రభుత్వ రీయింబర్స్ మెంట్ కవర్ కాదని స్పష్టం చేస్తూ పోలీసులకు జారీ చేసిన సర్క్యులర్ ఇది. క్లుప్తంగా ఈ సర్క్యులర్ సారాంశం ఇదే.
కానీ బండి సంజయ్ ట్వీట్ చేసిందేమిటి? ఎంపానెల్డ్ ఆసుపత్రుల్లో పోలీసులకు చికిత్స నిరాకరించడం ఏమిటి? చికిత్స చేయాలని జీవోలు ఇస్తారుగాని, నిరాకరించాల్సిందిగా జీవో జారీ చేసిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానికే దక్కుతుందని తన ట్వీట్ లో వ్యాఖ్యానించారు. వాస్తవానికి ఎంపానెల్డ్ ఆసుపత్రుల్లో కరోనా వైద్య పరీక్షలకు ఎటువంటి చికిత్సా సౌకర్యాలు కూడా ఉండవు. అటువంటి చోట వైద్యం ఎలా చేస్తారనేది ఓ ప్రశ్న. ఇక్కడే సంజయ్ బొక్క బోర్లా పడ్డారనే వాదన వినిపిస్తోంది.
వాస్తవానికి ఈ సర్క్యులర్ అంశంలో సంజయ్ కేసీఆర్ ప్రభుత్వాన్ని ఫిక్స్ చేయాల్సింది ఈ పద్ధతిలో కాదేమో? కరోనా సోకిన పోలీసులకు గాంధీ ఆసుపత్రిలో కాకుండా యశోద, అపోలో వంటి కార్పొరేట్ ఆసుపత్రుల్లో చికిత్స చేయించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తే బావుండేదేమో!
‘అన్నా… బండి సంజయ్ అన్నా… ఇది జీవో కాదన్నా. పోలీసు ఉన్నతాధికారి ఇచ్చిన సర్క్యులర్ లేదా ఇంటర్నల్ లెటర్ మాత్రమే. అందులోని అసలు భావం, అర్థం వేరు. మీకు అర్థమైంది వేరేగా ఉన్నట్టుంది. బొక్క బోర్లా పడ్డట్టుంది అన్నా. గిట్లయితే కేసీఆర్ ను ఢీకొట్టడం కష్టమేమో? జెర సోచాయించాలె మరి!’ అంటున్నారు తెలంగాణా బీజేపీ నాయకులు, కార్యకర్తలు. అదీ సంగతి.
బండి సంజయ్ చేసిన ట్వీట్ ను, అటాచ్ చేసిన సర్క్యులర్ ను దిగువన చూడవచ్చు.