‘టీఆర్ఎస్ కరదీపిక’పై బీజేపీ సంచలన గురి
RNI రద్దుకు, ప్రచురణ నిలిపివేతకు డిమాండ్
‘నమస్తే తెలంగాణా’ దిన పత్రికపై బీజేపీ రాష్ట్ర కార్యదర్శి, దుబ్బాక ఉప ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థి ఎం. రఘునందన్ రావు ఫిర్యాదు చేశారు. ఆ పత్రిక ఆర్ఎన్ఐ రద్దు చేయాలని, దాని యాజమాన్యం, ఎడిటర్ సహా విలేకరులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, పత్రిక ప్రచురణను నిలిపివేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈమేరకు రఘునందన్ రావు దుబ్బాక అసెంబ్లీ ఎన్నికల రిటర్నింగ్ అధికారితోపాటు సంబంధిత మిగతా ప్రభుత్వ విభాగాలకు కూడా ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.
తెలంగాణాలో అధికార పార్టీ కరదీపికగా భావిస్తున్న ‘నమస్తే తెలంగాణా’ పత్రిక ఆర్ఎన్ఐ (రిజిస్ట్రార్ ఆఫ్ న్యూస్ పేపర్స్ ఫర్ ఇండియా) రద్దు చేయాలని రఘునందన్ రావు కోరడం కీలకాంశం. భారత పార్లమెంట్ చేసిన చట్టాన్ని అవమానపరుస్తూ, ప్రధాన మంత్రిపట్ల, బీజేపీ దుబ్బాక అభ్యర్థిపట్ల ఓటర్లకుగల అసమానమైన గౌరవాన్ని పోగొట్టేలా ‘నమస్తే తెలంగాణా’ విషపు, అబద్ధపు, తప్పుడు వార్తలు పునః ప్రచురించిందని రఘునందర్ రావు ఆరోపణ. పత్రికకు చెందిన కంపెనీని కూడా రద్దు చేయాలని ఆయన కోరారు.
కంపెనీ చైర్మన్, వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ దివికొండ దామోదర్ రావు, ఎడిటర్ తిగుళ్ల కృష్ణమూర్తి, కంపెనీ డెరక్టర్లు, ఈసీ మెంబర్లు, వార్తాలు రాసిన విలేకరులపై చర్యలు తీసుకోవడంతోపాటు, ఉచితంగా పంపిణీ చేసిన పత్రికల విలువను టీఆర్ఎస్ అభ్యర్థి అకౌంట్లో జమచేసి ఖర్చు కింద రాసేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. నమస్తే తెలంగాణా దినపత్రిక ప్రచురణను నిలిపివేయాలని, ఆర్ఎన్ఐ, కంపెనీ, రిజిస్ట్రేషన్ రద్దుకు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని రఘునందన్ రావు తన ఫిర్యాదులో కోరారు. ఈనెల 31వ తేదీనే ఆయన ఈ ఫిర్యాదు చేసినప్పటికీ, బుధవారం విషయం వెలుగులోకి వచ్చింది.