ఔను… తెలంగాణా బీజేపీ తన ఫార్ములాకు అనుగుణంగానే ‘టార్గెట్’కు చేరుకుంది. ఎక్కడో ఓ మూల నుంచి ‘సెకండ్’ పొజిషన్ కు చేరుకుంది. బీజేపీ కోరుకున్నదీ, గ్రేటర్ ప్రజలు ఇచ్చిన తీర్పు ఒక్కటేనని స్పష్టమైంది. ఓ రకంగా చెప్పాలంటే అనుకున్న సమయానికన్నా ముందే ఎంచుకున్న లక్ష్యానికి బీజేపీ చేరుకుంది. ఇందులో ఏదేని డౌటుందా? అయితే విషయాన్ని పూర్తిగా తెలుసుకోవలసిందే. ఇంతకీ బీజేపీ ఎంచుకున్న ఫార్ములా ఏంటి?
గత అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఒకే ఒక స్థానాన్ని దక్కించుకున్న బీజేపీకి గ్రేటర్ ఎన్నికల ఫలితాలు ఎనలేని కళను తీసుకువచ్చాయి. అసలు బీజేపీ అనుసరించిన ఫార్ములాను లోతుగా పరిశీలిస్తే… వచ్చే మూడేళ్ల కాలం నాటికి తెలంగాణాలో టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలి. ఏదేని అద్భుతం జరిగితే తప్ప అది ఒక్కరోజులో సాధ్యమయ్యే పని కాదు. కానీ ఏం చేయాలి? అర్థబలం, అంగబలం పుష్కలంగా గల అధికార పార్టీని ఢీకొనడం అంత సులభమేమీ కాదు. టీఆర్ఎస్ చీఫ్, సీఎం కేసీఆర్ రాజకీయ ఎత్తుగడలను ఎలా ఎదుర్కోవాలి? ఇదీ బీజేపీ నేతల సందేహం.
కానీ, ఎంచుకున్న అసలు టార్గెట్ ఒకటే. ముందు పొజిషన్ మారాలి… మార్చాలి. తామున్నది ఏ స్థానమో తమకే తెలియని అయోమయ స్థితి నుంచి బయటకు రావాలి. ఇప్పుడున్న స్థానం ఏదైనా ముందు విపక్ష స్థానానికి చేరుకోవాలి. అంటే నెంబర్ 2 స్థానానికి చేరుకోవాలి. ఆ స్థానంలో గల కాంగ్రెస్ ను అధిగమించాలి. తెలంాణా రాజకీయాల్లో గల ‘శూన్యత’ను భర్తీ చేయాలి. అది బీ.జేపీ వల్ల మాత్రమే సాధ్యమవుతుందనే విషయాన్ని ప్రజలకు చేరవేయాలి.
అసెంబ్లీ ఎన్నికల్లో పూర్తిగా చతికిల పడిన బీజేపీకి పార్లమెంట్ ఎన్నికల్లో పరిస్థితి అనూహ్యంగా కలిసొచ్చింది. కారణం ఏదైనా కావచ్చు. అనూహ్యంగా నాలుగు ఎంపీ స్థానాలను ‘కమలం’ పువ్వు కైవసం చేసుకుంది. సీఎం కేసీఆర్ కూతురినేకాదు, ఆయన కుడిభుజంగా ప్రాచుర్యం పొందిన బోయినపల్లి వినోద్ కుమార్ ను సైతం బీజేపీ ఓటమి బాట పట్టించింది. సోలిపేట రామలింగారెడ్డి అకాల మరణంతో దుబ్బాక ఉప ఎన్నికల్లో పోరాడే అవకాశం బీజేపీకి లభించింది. వీరోచిత పోరాటం ద్వారా ఆశించిన విజయం దుబ్బాకలో లభించింది. ఈ ఫలితం బీజేపీ నేతల్లో రెట్టించిన ఉత్సాహాన్ని నింపింది.
గాలి వీచినపుడే తూర్పారబట్టాలి అనే సామెతకు అనుగుణంగానే దుబ్బాక ఫలితాన్ని ప్రామాణికంగా తీసుకుని గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల బరిలోకి బీజేపీ దూకింది. అధికార పార్టీకే కాదు, పాతబస్తీలో గట్టి ప్రాబల్య గల ఎంఐఎం పార్టీకి కూడా సవాల్ విసిరింది. ‘బస్తీ మే సవాల్’… అంటూ కొన్నిచోట్ల, బాహాబాహీ పోరాటాల ద్వారా మరికొన్ని చోట్ల హోరాహోరీ పోరాటానికి దిగింది. బహుషా బీజేపీ నేతలు కూడా అంచనా వేసి ఉండకపోవచ్చు. నాలుగు డివిజన్ల నుంచి 48 స్థానాలకు చేరుకున్న విజయోత్సాహం ఇప్పుడు బీజేపీ దూకుడును మరింత పెంచే ప్రామాణిక అంశం.
సీట్లే కాదు, ఓట్ల పరంగానూ అధికార పార్టీకి ధీటుగా బీజేపీ ఎదిగినట్లు గ్రేటర్ ఓటర్ల తీర్పు స్పష్టం చేస్తున్నది. గులాబీ పార్టీకన్నా 0.64 శాతం ఎక్కువ ఓట్లను సాధించినట్లు తాజా వార్తల సారాంశం. బీజేపీ 31.43 శాతం, టీఆర్ఎస్ 30.79 శాతం, ఎంఐఎం 15.97 శాతం, కాంగ్రెస్ 5.95 శాతం చొప్పున ఓట్లు సాధించినట్లు తెలుస్తోంది. ఈ పరిణామం అధికార పార్టీకి ‘డేంజర్ బెల్స్’గా భావించడంలో ఎటువంటి అనుమానం కూడా లేదు. కేవలం ఓట్లే కాదు గ్రేటర్ ప్రజల తీర్పులో సీట్ల పరంగానూ బీజేపీ ఇప్పుడు టీఆర్ఎస్ కు అత్యంత చేరువగా వచ్చేసింది.
కనుమరుగైన కాంగ్రెస్ సంగతి వదిలేయండి. గ్రేటర్ ఎన్నికల్లో రెండో స్థానంలో గల మజ్లిస్ పార్టీని సైతం బీజేపీ దాటేసింది. ఇప్పుడు జీహెచ్ఎంసీలో మజ్లిస్ పార్టీ 44, బీజేపీ 48 మంది కార్పొరేటర్ల బలాన్ని కలిగి ఉన్నాయి. బీజేపీ కోరుకున్నది కూడా ఇదే. ముందు విపక్ష స్థానాన్ని ఆక్రమించాలి. ఆ తర్వాతే అధికార పీఠాన్ని అధిష్టించాలనేది బీజేపీ ఎంచుకున్న అసలు ఫార్ములా. అందుకు అనుగుణంగానే అడుగులు పడుతున్నాయ్. ‘గ్రేటర్’ తీర్పు ‘జోష్’తో బీజేపీ చూపు ఇప్పుడు నాగార్జునసాగర్ ఉప ఎన్నికపై పడింది. ఇప్పటికే ‘సంఘ్ పరివారం’ అక్కడికి చేరుకున్నట్లు సమాచారం. అంతేకాదు వరంగల్, ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికలకూ కాషాయ దళం కాలు దువ్వుతోంది. కారు-సారు… అంటూ మీడియాలో భజనకీర్తనలు ఆలపిస్తున్న టీఆర్ఎస్ వీరాభిమానులకు ‘కాషాయ’ పార్టీ ఘంటికల చప్పుడు వినిపిస్తున్నట్లే కదా!