తెలంగాణాలో బర్డ్ ఫ్లూ ఆనవాళ్లు కనిపిస్తున్నాయా? ఇందుకు సంబంధించి అధికారికంగా ఎటువంటి ధ్రువీకరణ సమాచారం లేకపోయినా, వరుసగా వెలుగు చూసిన రెండు వేర్వేరు ఘటనలు ప్రజలను తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్నాయి. వికారాబాద్ జిల్లాలో వందలాది కోళ్లతోపాటు కాకులు మృత్యువాత పడుతున్న ఘటనను ప్రజలు మరువక ముందే కరీంనగర్ జిల్లాలో మరో ఉదంతం వెల్లడైంది.
హుస్నాబాద్ నియోజకవర్గంలోని చిగురుమామిడి మండలం నవాబుపేటకు చెందిన రైతు తిరుపతి పెంచుతున్న నాటుకోళ్లు భారీ ఎత్తున చనిపోవడం ప్రజల్లో భయాందోళనకు కారణమైంది. తిరుపతి పెంచుతున్న 1,500 నాటు కోళ్లలో పెద్ద సంఖ్యలో గడచిన 24 గంటల వ్యవధిలోనే మృత్యువాత పడ్డాయి. ఈ కోళ్ల మృతికి సంబంధించిన కారణాలు ఇతమిద్దంగా తెలియరాలేదు. కానీ అటు వికారాబాద్ జిల్లాలో కోళ్లు, కాకులు, ఇటు కరీంనగర్ జిల్లాలో నాటుకోళ్ల మృతి ఘటనలు ప్రజలను భయపెడుతున్నాయి. ఈ ఘటనలు బర్డ్ ఫ్లూ ఆనవాళ్లు కావచ్చనే అనుమానాన్ని ప్రజలు వ్యక్తం చేస్తున్నారు.