బావుసాహెబ్ అహిర్. మహారాష్ట్రలోని థానే ప్రాంతంలోని అంబివ్యాలీ నివాసి. దినసరి కూలీ జీవనశైలి . రోజువారీ కూలీ చేసి రూ. 300 మేర సంపాదించుకుని పొట్ట పోసుకుంటుంటాడు. ఇటీవలే అతనికి ఆదాయపు పన్ను శాఖ నుంచి ఓ నోటీసు వచ్చింది. మొత్తం రూ. 1.05 కోట్ల ఆదాయపు పన్ను చెల్లించాలన్నది నోటీసులోని సారాంశం. బెంబేలెత్తిన బావుసాహెబ్ లబోదిబోమంటున్నారు. దినసరి కూలీ చేసుకుని జీవించే తాను రూ. 1.05 కోట్ల మొత్తాన్ని ఎలా చెల్లించాలో తెలియక పోలీసులను ఆశ్రయించారు. ఇటువంటి నోటీసు రావడం ఇది తొలిసారి కాదని, గత సెప్టెంబర్ నెలలో మొదటిసారి నోటీసు వచ్చిందని, తాజాగా మరోసారి నోటీసులు వచ్చాయని ఆయన వాపోతున్నారు. నోట్ల రద్దు సమయంలో బావుసాహెబ్ బ్యాంక్ తాతాలో రూ. 58.00 లక్షలు జమ అయ్యాయని ఐటీ అధికారులు నోటీసులో స్పష్టం చేశారు. దీంతో తన పేరుతో పాన్ కార్డు, ఇతర పత్రాలతో బ్యాంకు అకౌంట్ ఉన్నట్లు గుర్తించిన బావుసాహెబ్ న్యాయం కోసం పోలీసులను ఆశ్రయించడం గమనార్హం.
ఇదిలా ఉండగా మధ్యప్రదేశ్ లోనూ ఇటువంటి సంఘటన మరొకటి వెలుగులోకి రావడం విశేషం. రూ. 6,000 నెలవారీ వేతన జీవిగా బతుకుతున్న రవి గుప్తా అనే భింద్ ప్రాంత నివాసికి కూడా ఐటీ శాఖ నోటీసులు పంపించింది. రవి గుప్తా పేరుపై గల బ్యాంక్ ఖాతాలో రూ. 132.00 కోట్ల రూపాయల లావాదేవీలు జరిగినట్లు గుర్తించిన ఐటీ అధికారులు రూ. 3.49 కోట్ల మొత్తాన్ని టాక్స్ కింద చెల్లించాలని నోటీసులు జారీ చేశారు. దీంతో తన పేరుపై కూడా ఎవరో నకిలీ బ్యాంక్ అకౌంట్ తెరిచి లావాదేవీలు నిర్వహించినట్లు గుర్తించిన రవి గుప్తా పోలీసులను ఆశ్రయించారు. ఈ అంశంలో ఐటీ అధికారులు ఏం చేస్తారో చూడాలి మరి.